చోర్ బజార్. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. దొంగిలించినవి తక్కువ రేటుకు అందించే ఒక మార్కెట్ అది. ఎలాంటి బ్రాండెడ్ వస్తువైనా.. దాని పేరు మీద ఉన్న నకిలీ వస్తువైనా అక్కడ దొరుకుతుంది. వాటిని ఎక్కడి నుంచి తీసుకువస్తారో.. లేక దొంగిలించుకు వస్తారో ఎవ్వరికీ తెలియదు. అందుకే వీటిని చోర్ బజార్ అంటారు. అయితే బెంగళూరులోని చోర్ బజార్‌లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చోర్ బజార్‌లో వీడియోలు తీస్తున్న విదేశీ పౌరుడిపై.. స్థానిక వ్యాపారి దాడి చేశాడు. దీంతో ఈ విషయాన్ని ఆ విదేశీయుడు సోషల్ మీడియాలో ఉంచడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యాపారిని అరెస్ట్ చేశారు.
నెదర్లాండ్స్‌కు చెందిన డచ్ పౌరుడైన పెడ్రో మోటా అనే ఓ యూట్యూబర్ బెంగళూరులోని చిక్‌పేట్‌లో ఉన్న చోర్ బజార్‌కు వెళ్లాడు. అక్కడ కెమెరా ఓపెన్ చేసి.. చోర్ బజార్ గురించి వివరిస్తున్నాడు. ఇంతలో అక్కడ ఉన్న నవాబ్ హయత్ షరీఫ్ అనే వ్యాపారి పెడ్రో మోటా వద్దకు వచ్చాడు. ఇక్కడ ఏం చేస్తున్నావ్.. ఏం వీడియో తీస్తున్నావ్ అంటూ.. వారించాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న పెడ్రో మోటా.. నమస్తే అంటూ అక్కడి నుంచి పారిపోయే యత్నం చేశాడు. ఇంతలో పెడ్రో చేతిని గట్టిగా పట్టుకున్న షరీఫ్.. ఇక్కడ నీకేం పని అంటూ దాడి చేశాడు. దీంతో బలంగా చేయిని వదిలించుకున్న పెడ్రో అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను కర్ణాటక పోలీసులు ఆదివారం విడుదల చేశారు. తనను వదిలి పెట్టాలంటూ షరీఫ్‌ను.. పెడ్రో బతిమాలడం కూడా ఆ వీడియోలో ఉంది.
ఈ ఘటనతో అక్కడి నుంచి పెడ్రో పారిపోయాడు. తర్వాత ఆ ఘటనకు సంబంధించిన వీడియోను పెడ్రో యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. భారత్‌లోని చోర్ బజార్‌లో దాడికి గురయ్యానంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు పోలీసులు.. దీనిపై విచారణ జరిపారు. ఘటనకు కారణమైన చోర్‌బజార్ వ్యాపారి షరీఫ్‌ను అరెస్ట్ చేశారు. విదేశీ పర్యాటకులను భయపెట్టడం.. వారిపై దాడులకు పాల్పడటం చేస్తే వదిలి పెట్టేది లేదని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.