ఎండ తీవ్రతతో చెరువుల్లో నీరు వేడెక్కి ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కలిదిండి మండ లంలో 23 వేల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఉప్పుటేరులోకి ముందస్తుగా ఉప్పు నీరు రావటంతో చెరువులకు తీపి నీరు తోడే అవకాశం లేకపోయింది. దీంతో చెరువుల్లో నీటిమట్టం తగ్గి నీరు చిక్కబడి జిగురుగా మారడంతో చేపలకు జలగ వ్యాధిసోకి మృత్యువాత పడి తేలియాడుతున్నా యని రైతులు వాపోతున్నారు. ఆక్సిజన్ కొరత నివారణకు ఖరీదైన మందులు వాడుతున్నప్పటికీ ఫలితం లేదంటున్నారు. ఎకరానికి రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు హడావుడిగా చేపలను పట్టుబడి చేసి విక్రయిస్తుంటే పెట్టుబడులు రావటం లేదని వాపోతున్నారు. చెరువుల్లో ఉప్పు శాతం అధికంగా పెరగటంతో ఎదుగుదల ఆగిపోయింది. మేత పెట్టుబడి ఎక్కువవు తోంది. చేపల చెరువుల లీజులు పెరిగాయి. ఎకరం లీజు లక్ష రూపాయల వరకు పలుకుతోంది. తీపి నీరు కొరత ఏర్పడటంతో చేపల సాగు ప్రశ్నార్థకం గా మారింది. పెదపుట్లపూడి, మూల్లంక, మట్టగుంట, కొండంగి గ్రామాల్లో చెరువుల్లో చేపలు చనిపోతుండటంతో హడావిడిగా పట్టుబడి చేసి అయిన కాడికి అమ్ముకుంటున్నారు.