డిప్యూటీ సీఎం నారాయణస్వామికిగాని, ఆయన కుటుంబ సభ్యులకు గాని గంగాధరనెల్లూరు టిక్కెట్ ఇస్తే పనిచేయబోమని పెనుమూరు మండల వైసీపీ నేతలు స్పష్టంచేశారు. ఇంకెవరికైనా ఇస్తే పనిచేస్తామన్నారు. ఈ మేరకు సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో పెనుమూరు మండల వైసీపీ అధ్యక్షుడు సురే్‌షరెడ్డి, జడ్పీటీసీ దొరస్వామియాదవ్, మాజీ సర్పంచ్ రామకృష్ణ మాట్లాడారు. గంగాధర నెల్లూరు .నియోజకవర్గంలో కులాలకు, మతాలకు అతీతంగా వైసీపీలో అన్నదమ్ముల్లా పనిచేస్తున్నామని చెప్పారు. అలాంటి తాను ఎస్సీనని, అగ్రవర్ణాల పెత్తనం అంటూ కులాల మధ్య నారాయణస్వామి చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. తాము పార్టీ కోసం కష్టపడి పనిచేసి.. బయటి వ్యక్తి అయినా రెండుసార్లు నారాయణస్వామిని గెలిపించామన్నారు. పార్టీ కోసం కష్టపడినవారిని పక్కనపెట్టి నాయకులకు, కార్యకర్తలకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయా మండలాల్లో తన సొంత కోటరీని నియమించుకుని వారికి పనులు చేస్తూ, వైసీపీ శ్రేణులను పక్కన పెట్టారని తీవ్రంగా విమర్శించారు. ఆయన తీరు ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైసీపీ నాయకులు వేరే పార్టీని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అధిష్ఠానం గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మండలానికి చెందిన సింగిల్‌విండో అధ్యక్షుడు గోవిందరెడ్డి, వైస్ ఎంపీపీ కోదండన్, మండల గౌరవాధ్యక్షుడు దేవరాజులురెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ జ్యోతి, నాయకుడు రాజారెడ్డి, ఏడుగురు ఎంపీటీసీలు పాల్గొన్నారు.