రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేలిలో గల ఏకైక ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని చిట్వేలి హెల్ప్ లైన్ సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం చిట్వేలి మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా చిట్వేలిలో ప్రభుత్వ ఉర్దూ మాధ్యమ పాఠశాల నిర్వహిస్తున్నారన్నారని, 40 మందికి పైగా విద్యార్థులు ఉర్దూ పాఠశాలలో విద్యను అభ్యసించే వారని, గతంలో ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు బోధన చేసేవారన్నారు. మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడిని కూడా ఉంచకుండా రిలీవ్ చేయడం ఇప్పటికి ప్రశ్నార్థకంగానే ఉందన్నారు. మూడు సంవత్సరాల నుండి ఉపాధ్యాయుల భర్తీ కోసం ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులకు విన్నవించుకుంటున్నామని, భర్తీ చేస్తామని మాట ఇస్తున్నారు కానీ అవన్నీ ఆచరణలో కనిపించడం లేదన్నారు. కనీసం ఈ విద్యా సంవత్సరంలో నైనా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.