జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం అన్నవరం వెళ్లనున్నారు. అయితే.. పవన్ వస్తుండటంతో ఆలయ ఈవో అలర్ట్ అయ్యారు. అన్నవరం దేవస్థానం ఈవో.. జిల్లా ఎస్పీని భద్రత కోరారు. ఇదే సమయంలో.. కీలక కామెంట్స్ చేశారు. పవన్ దర్శనంపై అధికారిక సమాచారం లేదన్నారు. పవన్ కొండపైకి వస్తే భారీగా అభిమానులు వస్తారని.. భక్తుల భద్రత దృష్ట్యా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరారు.
మరోవైపు పవన్ వారాహి యాత్ర కు అనుమతిపై సోమవారం వరకు ఉత్కంఠ నెలకొంది. కానీ.. తాజాగా పవన్ వారాహి యాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. వారాహి యాత్రకు పోలీసుల తరఫు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కీలక ప్రకటన వచ్చింది. డీఎస్పీలు జనసేన నేతలతో టచ్‌లో ఉన్నారని.. చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేయొచ్చని.. భద్రత కారణాల దృష్ట్యా మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రమే అడిగామని కాకినాడ ఎస్పీ వెల్లడించారు.
ఇటు తెలంగాణ రాజకీయాలపైనా పవన్ ఫోకస్ పెట్టారు. సోమవారం తెలంగాణ జనసేన నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యం. జనసేన బలమైన శక్తిగా మారుతుంది. ఉనికిని కాపాడుకుంటూ బలమైన భావజాలానికి కట్టుబడి ఉంటే మంచి రోజులు వాటంతట అవే వస్తాయి. ఊరికి పదిమంది బలంగా నిలబడటం వల్లే ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యింది' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
పవన్‌తో సమావేశం తర్వాత తెలంగాణ జనసేన నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పవన్ సూచించారు. ఇంఛార్జిలు ప్రజలతో ఉండి.. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో తెలంగాణలో వారాహి యాత్ర ఉంటుందన్నారు' అని తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ వెల్లడించారు.