ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ సందర్భంగా సునీత స్వయంగా వాదనలు వినిపిస్తూ పలు అంశాలను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలు, అనేక అంశాలను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇదే కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని సునీత రెడ్డి తెలిపారు. చివరిగా సీబీఐ విచారణకు రమ్మంటూ మూడు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన హాజరు కాలేదన్నారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యంతో ఉందనే కారణాలు చూపించి వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్పత్రిలో షెల్టర్ తీసుకున్నారని చెప్పారు. సీబీఐ అరెస్టు చేయకుండా ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన మద్దతుదారులు, గూండాలు అడ్డుపడ్డారని పేర్కొన్నారు. స్థానిక పోలీసుల సమక్షంలోనే అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలోని ఆధారాలు చెరిపేశారని చెప్పారు.
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆధారాలు చెరిపేయటమే కాకుండా గుండెపోటుతో చనిపోయినట్లుగా ఓ కట్టుకథ అల్లి ప్రచారం చేశారని సునీత తెలిపారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేయకుండా చూశారన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి ఇతర నిందితులతో కలిసి.. రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం సహకారంతో అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతుతో అదే పనిగా సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు వ్యతిరేకంగా తప్పుడు ఫిర్యాదులు చేయడమే కాకుండా కేసులు నమోదు చేయించారని పేర్కొన్నారు.
తనకు సహకరిస్తున్న అధికార యంత్రాంగం అధికార పార్టీలోని కీలక వ్యక్తులు సహాయంతో సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు బెదిరిస్తున్నారని సునీతరెడ్డి తెలిపారు. అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ కూడా ఇచ్చారని తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య గురించి బయటి ప్రపంచానికి తెలియడానికి ముందే సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుసని కూడా సీబీఐ పేర్కొందని చెప్పారు.
ఈ నెల 30వ తేదీ నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించిందని సునీత రెడ్డి గుర్తు చేశారు. ఈ కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్‌ను కూడా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిందని.. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాక దర్యాప్తు కొనసాగింపునకు కూడా అడ్డుగా నిలిచే అవకాశం ఉందని వివరించారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలోనే ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత తెలిపారు.