నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతూ ఏపీతో సహా మరికొన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడులలోని మిగిలిన ప్రాంతాలు.. వాయవ్య బంగాళాఖాతం, సిక్కిం, బిహార్‌లలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఏపీ విషయానికి వస్తే.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించగా.. ప్రస్తుతం ఏపీతో పాటు యానాం వైపు పడమటి గాలులు వీస్తున్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు రాయలసీమలోని పుట్టపర్తి వరకు విస్తరించాయి అని చెబుతున్నారు. ఏపీలో దక్షిణ కోస్తాలోని శ్రీహరికోట వరకూ ఆదివారం నైరుతి రుతుపవనాలు విస్తరించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంటున్నారు.
కొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఒకటి, రెండు చోట్ల వీస్తాయి అంటున్నారు. మంగళవారం 43 మండలాల్లో తీవ్రవడగాల్పులు.. అలాగే 266 మండలాల్లో వడగాల్పులు వీస్తాయంటున్నారు. బుధవారం 56 మండలాల్లో తీవ్రవడగాల్పులు.. 294 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
సోమవారం మన్యం జిల్లా సాలూరులో44.9°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో44.8°C, తిరుపతి జిల్లా పెద్ద కన్నాలిలో44.5°C, ప్రకాశం జిల్లా దొనకొండ, కాకినాడ జిల్లా కరపలో43.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. అలాగే 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 184 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు, తరువాత మూడు రోజులు వడగాడ్పులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు విస్తరించే కొద్ది వాతావరణంలో మార్పులు వస్తాయని.. వర్షాలు ఊపందుకుంటాయంటున్నారు.
మరోవైపు తెలంగాణలో కూడా అక్కడక్కడా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయంటున్నారు. ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో వడగాల్పులు కూడా వీస్తాయని చెబుతున్నారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.