టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన వారంతా.. తిరిగి అదే స్థానాల్లో పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. ఆ మేరకు తాను గ్రామీణం నుంచే పోటీలో ఉంటానన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్లు ఇస్తారని సంకేతాలు ఇచ్చారు. రాజమండ్రి రూరల్ టికెట్టు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారనే ఊహాగానాలు వినిపిస్తుండటంతో తనకే మళ్లీ సీటు అని క్లారిటీ ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యుత్తు ఛార్జీలు పేదవాళ్లపై గుదిబండలా భారంగా మారాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో విద్యుత్తు రంగం కుదేలైందని.. గతంలో రూ.500 వచ్చే బిల్లులు ఈ నెల రూ.1,600 వరకూ పెరిగాయి అన్నారు. అప్రకటిత కోతల వల్ల పరిశ్రమలు కుంటుపడుతున్నాయని.. వ్యవసాయ రంగం కుదేలవుతోందన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కేవలం రూ.5 కే విద్యుత్తును కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రూ.12, ఆపై కొనుగోలు చేసి, ప్రజలపై భారం మోపుతుందన్నారు.
రాష్ట్రంలో పవర్ కి కూడా హాలిడే ప్రకటించే దుస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలతో ప్రజలు కూడా ఇబ్బందిపడుతున్నారన్నారు. టీడీపీ 35 లక్షల కరెంట్ కనెక్షన్లు ఇస్తే.. జగన్ సర్కార్ మాత్రం కేవలం 8 లక్షలు కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పర్యటనలు, లోకేష్ పాయాత్ర, వారాహి యాత్రలను ఎవరూ ఆపలేరన్నారు కేంద్రం కూడా ఏపీ ప్రభుత్వంపై ఆరపోణలు చేసిందని.. నిధులన్నీ గోల్‌మాల్ అయ్యాయన్నారు. కరెంట్ కోతలతో గృహ వినియోగదారులతో పాటు, ఆక్వా రైతులు, చేనేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. ఉక్కపొతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.