ఏపీలో సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లది కీలక పాత్ర. వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఇటీవలే వాలంటీర్లకు వందనం కార్యక్రమం ద్వారా ఘనంగ సత్కరించి.. మూడు కేటగిరీల్లో నగదు బహుమతి కూడా అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా వాలంటీర్లకు మరో శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఈసారి విద్యార్థులను స్కూళ్లకు చేర్పించేలా టాస్క్ ఇచ్చారు.. వారికి బ్యాడ్జ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని పిల్లలందరూ చదువుకొనేలా వంద శాతం జీఈఆర్ (స్థూల నమోదు నిష్పత్తి ) టార్గెట్‌గా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 5 నుంచి 18 ఏళ్లు వయస్సు ఉన్న పిల్లలను గుర్తించేందుకు సచివాలయాల పరిధిలోని వాలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తోంది ప్రభుత్వం.
వాలంటీర్ల ద్వారా పిల్లలు స్కూళ్లు, విద్యా సంస్థల్లో చేరారా లేదా అనే సమాచారాన్ని సేకరిస్తోంది. ఒకవేళ స్కూళ్లలో చేరని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు వాలంటీర్లు కౌన్సలింగ్ ఇవ్వనున్నారు.. నచ్చజెప్పి, వారిని స్కూలుకు పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకే సచివాలయాలు, వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. సచివాలయాల పరిధిలో నూరు శాతం జీఈఆర్ సాధించిన వాలంటీర్లకు ప్రత్యేకంగా ఈ బ్యాడ్జ్‌తో గుర్తింపు ఇస్తారు. నూరు శాతం జీఈఆర్ సాధించిన సచివాలయాలకు కూడా ఈ బ్యాడ్జ్ ద్వారా గుర్తింపు ఇవ్వనుంది ప్రభుత్వం.
రాష్ట్రవ్యాప్తంగా 2023 –24 విద్యా సంవత్సరంలో వంద శాతం జీఈఆర్ సాధించాలని నిర్ణయించినట్లు సీఎస్ ఉత్తర్వుల్లో తెలిపారు. 2030 నాటికి ఈ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికే ఈ లక్ష్యాన్ని సాధించనుంది. 2005 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31 మధ్య జన్మించిన పిల్లలు, వారి గృహాల సమాచారాన్ని రిథమ్ యాప్‌లో వాలంటీర్లకు అందించారు. ఈ ఆ సమాచారం ఆధారంగా 5 నుంచి 18 సంవత్సరాల వయస్సు పిల్లలు ఏదైనా స్కూలులో, కాలేజీలో చేరారా.. ఆయా సచివాలయ పరిధిలో ఉండాల్సిన పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లారా.. అక్కడ స్కూల్లో చేరారా లేదా అనే వివరాలు తీసుకుంటారు.
ఒకవేళ ఎవరైనా స్కూల్లో చేరకపోతే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. వారిని తీసుకొచ్చి ఆయా స్కూల్లో చేర్పిస్తారు. ఇలా స్కూళ్లు, విద్యా సంస్థల్లో చేర్పించిన పిల్లల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ పిల్లల పేర్లు ఎదురుగా గ్రీన్ టిక్ పెడతారు.. పిల్లలు స్కూళ్లలో చేరకపోతే వారి పేర్లు ఎదురుగా ఖాళీ వదిలిపెడతారు. ఇలా పిల్లల పూర్తి సమాచారం పోర్టల్‌లో నమోదు చేయనున్నారు.
వాలంటీరు వారి పరిధిలో నూరు శాతం జీఈఆర్ సాధిస్తే వారిని గుర్తిస్తూ ఈ బ్యాడ్జ్ అందజేస్తారు. అలాగే సచివాలయాల పరిధిలో వాలంటీర్లందరూ నూరు శాతం జీఈఆర్ సాధిస్తే ఆ సచివాలయాలకు కూడా ఈ బ్యాడ్జ్ ఇస్తారు. వివిధ శాఖలు నిర్వహించే విద్యార్థుల ప్రవేశాల వివరాలన్నీ పోర్టల్‌లో నమోదు చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎస్.