మాజీ మంత్రి రఘువీరారెడ్డి సొంత ఊరు శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి రఘువీరారెడ్డి సోదరుడు డాక్టర్ జయరాం, వదిన డాక్టర్ శాంతమ్మ రూ.కోటి విరాళం అందజేశారు. అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూ.50 లక్షలు అందజేశారు. రఘువీరారెడ్డి మరో సోదరుడు చలువమూర్తి కంటి ఆస్పత్రి కోసం 3 ఎకరాల భూమిని ఇస్తామని ప్రకటించారు.
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ,ఆసుపత్రి నిర్మాణానికి తోడ్పాటును అందించిన వారందరికి.. మరీ ముఖ్యంగా అత్యంత ఔదార్యాన్ని చూపిన తన అన్న, వదినలు డాక్టర్ శాంత, డాక్టర్ జయరామ్‌కు.. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి తమ ఊరి ప్రజలందరి తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రఘువీరారెడ్డి. మనిషికి కంటి చూపు ప్రధానమని.. ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రివారు దాతల సహకారంతో తమ స్వగ్రామంలో కంటి ఆస్పత్రిని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.
మాజీ మంత్రి రఘువీరా రెడ్డి నెలకొల్పిన ఆలయాల ప్రాశస్త్యంపై ప్రత్యేక పాటలు
ఏడాది కాలంలో 3,250 మందికి కంటి పరీక్షలు, 120 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించిన డాక్టర్ ఉషను రఘువీరారెడ్డి అభినందించారు. ఆస్పత్రికి రూ.కోటి విరాళం అందజేసిన తన అన్నావదినలకు రఘువీరా పాదాభివందనం చేశారు. 2025 నాటికి రూ.6 కోట్లతో కంటి ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తామని రఘువీరా ప్రకటించారు. ప్రస్తుతం నీలకంఠాపురం ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. కొత్తగా భవనం నిర్మించి.. అక్కడ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగు వ్యక్తి.. రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి చనిపోగా.. నీలకంఠాపురంలోనే ఖననం చేశారు. కేజీఎఫ్- 2 విడుదల రోజున ప్రశాంత్ సొంత ఊరికి వచ్చి తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు. తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరు నీలకంఠాపురంలో ఉన్న ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి తనవంతుగా విరాళం ప్రకటించారు ప్రశాంత్ నీల్.
రఘువీరారెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కొంతకాలం పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సొంత ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంత జీవితం గడిపారు. ఊరిలో ఆలయాలకు నిర్మాణం, పునరుజ్జీవన కార్యక్రమాలు చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపారు. మళ్లీ కర్ణాటక ఎన్నికల సమయంలో రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.. ప్రచారంలో కూడా పాల్గొన్నారు.