డబ్బు కోసం అమెరికాకు చెందిన కౌరీ రిచిన్స్ అనే మహిళ తన భర్తను చంపేసి.. ఏమీ ఎరగనట్టు ఆయన మరణం తర్వాత 'ఆర్ యూ విత్ మి' అనే పేరుతో పుస్తకం రాసి సానుభూతి పొందిన విషయం తెలిసిందే. తన భర్త మరణం తర్వాత తాము అనుభవించిన వేదన, ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఈ పుస్తకం రాసినట్టు అప్పట్లో ఆమె వెల్లడించింది. అయితే, మద్యంలో నిషేధిత డ్రగ్స్ కలిపి ఆమే హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. తాజాగా, ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. భర్త హత్యకు దీర్ఘకాలిక పథకం వేసిన ఆమె.. ధనవంతుల కోసం లగ్జరీ జైళ్లు, బీమా కంపెనీలు పరిహారం చెల్లించడానికి ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి విస్తృతంగా గూగుల్‌లో శోధించింది.
ఉటాలోని జైళ్ల సమాచారం గురించి ఇంటర్నెట్‌లో శోధించిన ఆమె.. ధనవంతుల కోసం విలాసవంతమైన జైళ్లు గురించి ఆరా తీసినట్టు ఓ మీడియా కథనం వెల్లడించింది. డిలీట్ చేసిన మెసేజ్‌లను దర్యాప్తు అధికారులు చూడగలరా? జీవిత బీమా కంపెనీలు క్లెయిమ్‌దారులకు చెల్లించడానికి ఎంత సమయం తీసుకుంటాయి? పోలీసులు మిమ్మల్ని లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోమని బలవంతం చేయవచ్చా? మరణ ధృవీకరణ పత్రంలో మరణానికి కారణాన్ని మార్చగలరా? అని కూడా శోధించినట్టు నివేదిక పేర్కొంది.
సోమవారం నాటి విచారణలో ఆమె గూగుల్ సెర్చ్‌ల వివరాలు బయటపడ్డాయి. దీనిని సమాజానికి తీవ్రమైన ప్రమాదంగా న్యాయమూర్తి అభివర్ణించారు. ఆమె కటకటాల వెనుక ఉండాల్సిందేనని ఆదేశించారు. అంతేకాదు ‘ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ కింద ఉన్న సంకేతాలు’, ‘డెత్ సర్టిఫికేట్ కోసం క్లెయిమ్ చెల్లింపులో జాప్యం’ వంటి శీర్షికలతో ఉన్న కథనాలను చదవినట్టు తెలిపింది.
అలాగే ‘నలోక్సోన్ హెరాయిన్‌తో సమానంగా ఉందా’, ‘మరణం అసహజ పద్ధతిగా పరిగణించేది ఏమిటి’ ‘కౌరీ రిచిన్స్ కమాస్ నికర సంపద’ వంటి వాటి గురించి కూడా ఆమె అంతర్జాలంలో శోధించినట్టు వివరించింది. మరోవైపు, ఎరిక్ రిచిన్స్ సోదరి అమీ మాట్లాడుతూ.. ఎరిక్ భయంకరమైన పరిస్థితులలో మరణించాడు. అతడి వేదన తనను బాధిస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని అతడు గ్రహించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొంది. ‘నా సోదరుడి మరణం నుంచి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించిన కౌరీ.. ఎంతో దుఃఖంతో ఉన్నట్టు నటించి.. అంతిమ యాత్రలో పాల్గొనడం మేము చూశాం’అని వ్యాఖ్యానించింది.
గతేడాది మార్చి 4న కౌరీ డార్డెన్ రిచిన్స్.. తన భర్త ఎరిక్ రిచిన్స్ తాగుతున్న మద్యంలో డ్రగ్ కలిపింది. అది తాగిన తర్వాత అస్వస్థతకు గురైన ఎరిక్.. స్పృహకోల్పోయి అచేతనంగా పడిపోయాడు. దీంతో తన భర్త శరీరం చల్లగా మారిందని.. 911 నంబరుకు ఆమె ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. అత్యవసర వైద్య సిబ్బంది అక్కడకు చేరుకొని స్పృహ కోల్పోయి ఉన్న ఎరిక్‌ను పరీక్షించారు. అతడ్ని కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే ఎరిక్ చనిపోయినట్టు ధ్రువీకరించారు.