ఏ దేశంలోనైనా పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం ఉందంటే దానికో ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షించే దేశాల్లో ఇటలీ ఒకటి. ఇక్కడి ప్రకృతి అందాలు, ఆహార పదార్థాలు ప్రతి ఒక్కరినీ తప్పక అలరిస్తాయి. రోమ్ నగరానికి ఉత్తరాన వాకోన్ అనే గ్రామం ఉంది. ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే... ఓ రెస్టారెంట్ అని చెప్పాలి. దీని పేరు సోలో పర్ డ్యూ. ఇటలీ భాషలో ఇద్దరికి మాత్రమే అని అర్థం. అసలు విషయం అంతా పేరులోనే ఉంది. పేరుకు తగ్గట్టుగానే ఈ రెస్టారెంటులో కేవలం ఇద్దరు మాత్రమే భోజనం చేసే వీలుంటుంది.
అసలు, ఈ రెస్టారెంటులో ఉన్నదే ఒకటే టేబుల్. అందుకే ఇది ప్రపంచంలోనే అతి చిన్న రెస్టారెంట్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఒక పూట భోజనానికి అయ్యే ఖర్చు మామూలుగా ఉండదు మరి. ఇద్దరికి ఒక పూట భోజనానికి రూ.41 వేలు వసూలు చేస్తారు. అలాగని ఈ రెస్టారెంటులో ప్రత్యేక వంటకాలేమీ ఉండవు. అతిథులు ఏం కోరుకుంటే అదే వండిపెడతారు... అదే ఇక్కడి స్పెషాలిటీ.
ప్రేమలో ఉన్నవారికి, హనీమూన్ వచ్చిన దంపతులకు ఇది సరైన ప్లేస్ అని ప్రచారంలో ఉంది. మెనూ అంటూ ఏమీ లేని ఈ రెస్టారెంట్ సంవత్సరం పొడవునా తెరిచే ఉంటుంది. లంచ్, డిన్నర్ మాత్రమే అందిస్తారు. యూరోపియన్ శైలిలో రాతితో నిర్మితమైన ఈ మాన్షన్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది.
ఫోన్ ద్వారా ఇక్కడ టేబుల్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పది రోజుల ముందు తాము వస్తున్నదీ, లేనిదీ కన్ఫామ్ చేయాలి. ఇక్కడి రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. రిజర్వేషన్ చేసుకోకముందు ఈ రెస్టారెంట్ కు వచ్చి ఓసారి చూస్తామంటే కుదరదు. బుకింగ్ చేసుకున్నవాళ్లకే దీంట్లోకి అనుమతిస్తారు.
చివరి నిమిషంలో భోజనం క్యాన్సిల్ అంటే ఇక్కడి నిర్వాహకులు ఏమాత్రం ఒప్పుకోరు. రెస్టారెంట్ యజమానులు నిర్దేశించిన సమయంలోనే అతిథులు రావాల్సి ఉంటుంది. అలాగని మరీ ముందు రావడం కుదురు... నిర్దేశిత సమయానికి 30 నిమిషాలు ముందు రెస్టారెంట్ నిర్వాహకులకు ఫోన్ చేసి తాము వచ్చేస్తున్నామని సమాచారం అందించాలి. ఒకవేళ వేళ తప్పి వచ్చారే అనుకోండి... తాళం వేసిన గేటు స్వాగతం పలుకుతుంది. పలకరించడానికి కూడా ఎవరూ రారు.వాకోన్ గ్రామానికి చెందిన ముగ్గురు ఫుడ్ ఎంటర్ ప్రెన్యూర్లు కలిసి గత 33 ఏళ్లుగా ఈ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు.