విశాఖలోని 16వ వార్డు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని, ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె మూడవ జోన్ 16 వార్డు పరిధిలోని కృష్ణ కాలేజీ ఏరియా, భాను నగర్, కేఆర్ ఎం కాలనీ, హెచ్ బి కాలనీ తదితర ప్రాంతాలలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ, వార్డ్ కార్పొరేటర్ మొల్లి లక్ష్మీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ వార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వాటిలో ముఖ్యంగా రోడ్లపై భవన నిర్మాణ సామగ్రి వేస్తున్నారని వాటిని నిరోధించాలన్నారు. పారిశుద్ధ్యం సరిగా నిర్వహించడం లేదని పారిశుధ్య నిర్వహణలో దృష్టి సారించాలన్నారు.
భాను నగర్ లో ఉన్న కాళీ ప్రాంతాన్ని శుభ్రం చేసి దాని చుట్టూ కంచి వేయాలని జోన్ల కమిషనర్ను ఆదేశించారు. పారిశుద్ధ కార్మికులు వార్డులో తక్కువగా ఉన్నారని, వీధిలైట్లు సరిగా వెళ్లడం లేదని, కుక్కలు అధికంగా ఉన్నాయని, భాను నగర్ లో రహదారి పనులు చేపట్టాలని, భూగర్భ డ్రైనేజీ పొంగుతుందని, అబ్దుల్ కలాం పార్కును ఆధునికరించాలని, కాళీ ప్రాంతాలను పార్కులుగా అభివృద్ధి చేయాలని స్థానిక కార్పొరేటర్ మేయర్ , కమిషనర్ దృష్టికి తీసుకురాగా కమిషనర్ స్పందిస్తూ సభ్యులు తెలిపిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, కొన్ని పనులకు అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పట్టణ ప్రణాళిక అధికారి సునీత, జోన్ల కమిషనర్ విజయలక్ష్మి, ఏ ఎం ఓ హెచ్ రాజేష్, డిడిహెచ్ దామోదర్, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.