నెల్లూరు జిల్లా, సంగం మండలం తరుణవాయికి చెందిన నక్కా హరికృష్ణ భార్య శాంతి రెండురోజుల క్రితం బంధువుల ఇంట జరిగే కార్యక్రమం కోసం బుచ్చికి వచ్చారు. శాంతి పుట్టినిల్లు కూడా బుచ్చి పట్టణమే. అలాగే శాంతి అక్క గీత, ఈమె భర్త వెంకటేశ్వర్లు కూడా హైదరాబాదు నుంచి ఇదే కార్యక్రమానికి బుచ్చికి వచ్చారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 11 గంటలకు తరణవాయి నుంచి వచ్చిన హరికృష్ణ తొలుత బుచ్చిలోని అత్తగారింటికి వచ్చి అక్కడి నుంచి పక్కనే తన వదిన గీత ఇంటికి వెళ్లాడు. అక్కడ గందరగోళం సృష్టించి, వెళ్లిపోయాడు. తిరిగి అర్ధరాత్రి 2.30గంటలకు మరోసారి గీత ఇంటికి వెళ్లి తలుపులు బాదడంతో ఆమె తలుపు తీసింది. వెంటనే కత్తితో ఆమె భర్త వెంకటేశ్వర్లుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. గీతపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఇంతలో పక్క ఇంట్లో నుంచి వచ్చిన ఆమె తల్లి, చెల్లెలు అడ్డుకున్నారు. వీరిపై కూడాదాడి చేసి పారిపోతుండగా, స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు నిందితుడు హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. రక్తపుమడుగులో ఉన్న నాగులూరు వెంకటేశ్వర్లును ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరప్రతాప్ తెలిపారు. తనపై అనుమానంతో వివాహేతర సంబంధాలు అంటగట్టి తరచూ దాడులు చేస్తుంటాడని హరికృష్ణ భార్య శాంతి ఆవేదన వ్యక్తం చేసింది.