కేంద్ర హోంమంత్రి అమిత్ షా కన్నెర్ర చేస్తే మరుక్షణంలో ఏపీలోని మద్యం స్కామ్ మొత్తం బట్టబయలయ్యే అవకాశం ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖ సభలో అమిత్ షా ఏపీలో జరుగుతున్న లిక్కర్ స్కామ్‌ను ప్రస్తావించారు. ఇప్పటి వరకు జగన్ రెడ్డిని పాపం పసివాడు అనుకున్నట్టున్నారు. కానీ భారీ అవినీతి పరుడునే విషయం ఇప్పుడే తెలిసొచ్చినట్టుంది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ పాలనలో మద్యం పాలసీలో రూ.200 కోట్ల కుంభకోణం జరిగిందని ఎంత మందిని జైళ్లలో పెట్టారో.. అందులో ఏపీ వాళ్లు ఎంత మంది ఉన్నారో దేశమంతా చూస్తోంది. జగన్ రెడ్డి పాలనలో ఆయన చెప్పిన మందే కొనాలి.. క్యాష్ మాత్రమే కట్టాలి. కూరగాయల దుకాణాలు, కిళ్లీ అంగళ్లలో కూడా పేటీఎం స్కానర్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ మద్యం షాపుల్లో మాత్రం ఓన్లీ క్యాష్. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా అంటుంటే జగన్ రెడ్డి మాత్రం క్యాష్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఏడాదికి రూ.30 వేల కోట్లు, నాలుగేళ్లలో లక్ష కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిగితే ప్రభుత్వ ఖజానాకు ఎంత జమయింది. వైసీపీ నేతల జేబుల్లోకి ఎంత చేరిందో దేవుడికే తెలియాలి. రాష్ట్రంలోని మద్యం డిస్టలరీలన్నీ జగన్ రెడ్డి కుటుంబ సభ్యుల చేతుల్లో ఉన్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో పౌరులైనా తమకు ఇష్టం వచ్చిన బ్రాండ్ మద్యం తాగొచ్చు. ఏపీలో మాత్రం జగన్ రెడ్డి చెప్పిన మద్యమే తాగాలి.. చావాలి.’’ అని సోమిరెడ్డి మండిపడ్డారు.