విశాఖలో వైసీపీ ఎంపీ భార్యాపిల్లల కిడ్నాప్ కలకలం రేపింది. ప్రముఖ ఆడిటర్, మాజీ స్మార్ట్ సిటి చైర్మన్ జీవీతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు చందు, భార్య జ్యోతి కిడ్నాప్ అయ్యారు. ఈ విషయం క్షణాల్లో మీడియాలో వైరల్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు క్షణాల్లో ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ఆచూకీని కనుగొన్నారు. కిడ్నాపైన ముగ్గురూ క్షేమంగా ఉన్నారని ఎంపీ తెలిపారు. విశాఖ-ఏలూరు రోడ్డులో ఎంపీ భార్య, కుమారుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కిడ్నాప్‌నకు ముగ్గురు వ్యక్తులు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ముగ్గురిలో రౌడీషీటర్ హేమంత్ కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు. హేమంత్‌పై గతంలో పలు కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ వీజారెడ్డిని హత్య చేసిన కేసులో హేమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కిడ్నాప్ అనంతరం రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఎంవీవీ విషయం తెలియగానే హుటాహుటిన వైజాగ్‌కు బయలుదేరారు.