చెన్నై నుంచి షిర్డీకి వెళ్తున్న షిర్డీసాయి ఎక్స్‌ప్రెస్ రైలును గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఇస్వీ-కుప్పగల్లు రైల్వే స్టేషన్ మధ్య రైలులో చైను లాగాడు. ఎస్1, ఎస్9 స్లీపర్ బోగీల వద్దకు వచ్చిన దొంగలు కిటికీల పక్కన నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఈ క్రమంలో కొందరు మహిళలు ప్రతిఘటించగా నిద్రిస్తున్న ముగ్గురు మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు. అర్ధరాత్రి కావడం, చల్లనిగాలికోసం కిటికీలను తెరచి ఉంచడంతో దొంగలు కిందనుంచే సులువుగా చోరీ చేయగలిగారు. కొద్ది నిమిషాల తరువాత అక్కడి నుంచి బయలుదేరిన రైలు మంత్రాలయం రైల్వే స్టేషన్ చేరుకుంది. ఆదోని రైల్వే స్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున 2:11కు స్టేషన్ చేరుకొని బయలుదేరినట్లు సమాచారం. ఇస్వీ-కుప్పగల్లు చైన్ లాగిన ప్రదేశంలో రైలు 11 నిమిషాల పాటు నిలిచిపోయినట్లు రైల్వే గార్డు మెసేజ్ ద్వారా ఆదోని స్టేషన్ మేనేజర్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రైల్వేస్టేషన్ ఎస్‌ఐ సాయిని వివరణ కోరగా షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు స్టాపింగ్ చైన్ లాగింది నిజమేనని, అయితే ఎవరూ కూడా చైన్ స్నాచింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయలేదన్నారు.