ఇంటి దగ్గరే ఉండి ఎల్‌ఈడీ బల్బులు తయారు చేస్తూ రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించవచ్చని దాదాపు వెయ్యి మంది నుంచి రూ.53 లక్షల మొత్తాన్ని వసూలు చేసిన మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం కర్నూలు జిల్లా, ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శివనారాయణ స్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని పూలబజారులో నివాసముంటున్న కాలువ శ్రీనివాసులు, కార్వన్ పేటలో నివాసముంటున్న బెస్త సంజయ్, శ్రీనివాసులు నవ భారత్ ఎలక్ర్టానిక్స్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో ఎల్‌ఈడీ బల్బులను ఇంటి వద్దనే తయారు చేసుకొని ని రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదించవచ్చని ప్రచారం చేశారు. దీనికి అవసరమయ్యే ముడి సరుకులు కూడా తామే ఇస్తామని నమ్మపలికారు. అందుకు అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి నుంచి రూ.1050 నుండి రూ.18వేల వరకు తమ ఖాతాలకు జమ చేయించుకున్నారు. కర్నూలులోని కల్లూరు ఎస్టేట్‌కు చెందిన ఎం నాగపుల్లయ్య రూ.10వేలన ఫోన్‌పే ద్వారా పంపించారు. డబ్బు తీసుకున్నవారు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ దగ్గర నుండి వచ్చిన ఫిర్యాదును చాలెంజ్‌గా తీసుకున్న వన్‌టౌన్ సీఐ విక్రమ సింహ విచారణ చేపట్టారు. తీగలాగితే డొంక కదలినట్లు వీరితో పాటు ఆదోనిలోని అమరావతి నగర్‌కు చెందిన మెహమ్మద్ సులేమాన్, బార్‌పేటకు చెందిన మెహబూబ్ బాషా వీరితో సంబంధాల్లో ఉన్నట్లు తెలిసింది. వీరు నిందితులకు దొంగ ఆధార్‌కార్డులు, సిమ్ కార్డులు అందించి సహకరించినట్లు తెలిసింది. వీరు ఐదుగురు గురువారం టీజీఎల్ కాలనీలో ఉన్నట్లు తెలుసుకున్న సీఐ తమ సిబ్బందితో వారిని అరెస్టు చేశారు. వీరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాలో 1000 మంది నుంచి రూ.53 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. అందులో రూ.30.60 లక్షలను జల్సాలకు ఖర్చు చేశారని, మరో రూ.18.66 లక్షలు బ్యాంకులో ఉంచినట్లు గుర్తించామని సీఐ విక్రమసింహ అన్నారు. బ్యాంకు ఖాతాలో లావాదేవిలను నిలిపివేసినట్లు తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ర్టేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ విక్రమ సింహ తెలిపారు.