పొన్నూరు నియోజకవర్గం అరాచకాలకు అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. ఇటీవల పచ్చలతాడిపర్రులో వైసీపీ నాయకులు పగులకొట్టిన టీడీపీ జెండా దిమ్మె సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని గురువారం పొన్నూరులో నిరసన ప్రదర్శన, ధర్నా జరిగింది. సైకో పోవాలి.. సైకిల్ రావాలి.., ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. వైసీపీ గూండాలను పోలీసులు కాపాడుతున్నారని నిరసించారు. ఐలెండ్ సెంటర్ నుంచి ప్రదర్శన రూరల్ పోలీస్స్టేషన్ వరకు చేరుకుంది. ఈ క్రమంలో నరేంద్ర శ్రేణులతో కలిసి అకస్మాత్తుగా స్టేషన్ ఎదుట జీబీసీ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చలతాడిపర్రులో వైసీపీ నాయకుల అరాచకాలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.