అర్హతే ప్రామాణికంగా, కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గరుగుబిల్లి మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికీ వెళ్లిన ఆమె నాలుగేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఏవైనా సమస్యలున్నా, అర్హులై ఉండి ఎవరికైనా పథకాలు అందకపోయినా వెంటనే తెలియజేయాలన్నారు. ఈ క్రమంలో పలువురు ఆమె దృష్టికి తీసుకువచ్చిన చిన్నచిన్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.