రిమాండ్‌లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ నలుగురు ఉద్యోగుల బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు పరిధిలోకి వెళ్లింది. జీఎస్టీ చట్టాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న అభియోగంపై గుడివాడ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కె.సంధ్య, జీఎస్టీవో బి.మెహర్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ వెంకట చలపతి, సబార్డినేట్ సత్యనారాయణలపై విజయవాడ పటమట పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు వారిపై ఐపీసీ 409, 167, 477, 201, 420, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా పోలీసులు ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టంలోని సెక్షన్ 7ను చేర్చారు. దీని ప్రకారం కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి వెళ్తుంది. ఈ కారణంగా నలుగురి బెయిల్ పిటిషన్లను తాము విచారించలేమని నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు తేల్చి చెప్పింది. ఫైళ్లను ఏసీబీ కోర్టుకు బదిలీ చేస్తామని చెప్పింది. ఈమేరకు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లను దాఖలు చేస్తామని నిందితుల తరఫు న్యాయవాది శివ తెలిపారు.