విజయనగరం జిల్లా, కొత్తవలస మండలంలోని నిమ్మలపాలెం రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని రైలు కింద పడి ప్రేమ జంట ఆత్యహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. జీఆర్పీ ఎస్‌ఐ రవి వర్మ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం తాటిగూడకు చెందిన నందుల చంద్రన్న(32), సీమగెడ్డకు చెందిన సెంబి స్వాతి(17) ప్రేమికులు. స్వాతి మైనర్ కావడంతో ఇరువురి వివాహానికి అడ్డంకులు వచ్చాయి. దీంతో మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి పోయారు. ఈ నేపథ్యంలో నిమ్మలపాలెం జంక్షన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద కొత్తవలస-విజయనగరం వెళ్లే రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు, యువతీ రైలు కింద పడి మృతి చెందినట్టు స్థానికుల ద్వారా విజయనగరం రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల పక్కన పడిఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా వారి ఆధార్‌కార్డులు లభించాయి. వీటి ఆధారంగా ఆత్మహత్య చేసుకుంది చంద్రన్న, స్వాతిగా గుర్తించారు. ఆధార్ కార్డులో ఉన్న సమాచారం మేరకు వారి బంధువులకు సమాచారం అందించారు. స్వాతి మైనర్ కావడంవల్ల వారి వివాహానికి అడ్డంకులు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జీఆర్పీ ఎస్‌ఐ రవివర్మ తెలిపారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.