కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చనిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ కోరినప్పుడు తాను తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో చేసిన పనికంటే రెండింతలు బీజేపీ 9 ఏళ్లలోనే చేసినట్లు చెప్పారు. బీజేపీ 9 ఏళ్ల పాలనపై మహారాష్ట్రలోని భండారాలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు.
‘‘మీరు చాలా మంచి కార్యకర్త, నాయకుడు. మీరు కాంగ్రెస్‌లో చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది’’ అని తనకు కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ చెప్పారని గడ్కరీ అన్నారు. ‘‘కానీ కాంగ్రెస్‌లో చేరడం కంటే బావిలో దూకడమే మేలని నేను ఆయనతో చెప్పాను. ఎందుకంటే బీజేపీ, దాని సిద్ధాంతాలపై నాకు బలమైన విశ్వాసం ఉంది. అందుకోసం నేను పని చేస్తూనే ఉంటాను’’ అని వివరించారు.
కాంగ్రెస్ లో ఎన్నోసార్లు చీలిక వచ్చిందని గడ్కరీ అన్నారు. ‘‘మనదేశ ప్రజాస్వామ్య చరిత్రను మనం మర్చిపోకూడదు. గతం నుంచి మనం నేర్చుకోవాలి. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చింది. కానీ నెరవేర్చలేకపోయింది. స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసింది’’ అని ఆరోపించారు. దేశాన్ని అసలైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ సఫలుడయ్యాడని కొనియాడారు.