జనసేన పార్టీని టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పవన్ పెట్టారా? అని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. జనసేనత అధినేత పవన్ కల్యాణ్ ను రాజకీయ వ్యభిచారి అంటూ ఆయన విమర్శించారు. పవన్ పార్టీలో ఒక్క కీలక నేత కూడా లేరని చెప్పారు. రాజు రవితేజ అనే వ్యక్తితో కలిసి పవన్ పుస్తకం రాశారని... అటువంటి రవితేజ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి పవన్ ను విమర్శించారని అన్నారు. ఎవరి మేలు కోసం జనసేన పని చేస్తోందని... రాష్ట్ర ప్రజల కోసమా? లేక చంద్రబాబు కోసమా? అని నిలదీశారు. తనపై పవన్ ఘాటు విమర్శలు చేసిన నేపథ్యంలో, ద్వారంపూడి కాకినాడలో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు.
తాను మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు గెలిచానని, పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. తనను విమర్శించే స్థాయి కూడా పవన్ కు లేదని అన్నారు. గెలిచే సత్తా లేదనే విషయం అర్థమయ్యే... చంద్రబాబుకు అనుకూలంగా పని చేయాలని ఇంతకు ముందు పవన్ నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబుతో ప్యాకేజీ, బేరం కుదరకపోవడంతో మళ్లీ మాట మార్చారని, తానే సీఎం అవుతానని అంటున్నారని విమర్శించారు. స్థిరత్వం లేని నాయకుడు పవన్ అని విమర్శించారు. మాటలు మార్చే నాయకుడిని ప్రజలు నమ్మరని చెప్పారు.
కాకినాడలో గత 50 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్నామని ద్వారంపూడి అన్నారు. సొంత సామాజికవర్గంలో తనకు పెద్దగా మద్దతు లేదని... అన్ని సామాజికవర్గాల ప్రజలు తనను గెలిపించారని చెప్పారు. తాను హీరోనని, పవన్ జీరో అని అన్నారు. పవన్ కు పరిటాల రవి గుండు కొట్టించారని చెప్పారు. ఎమ్మెల్యే, సీఎం కావాలనే నీ కోరిక సినిమాల్లోనే తీరుతుందని అన్నారు.