గడువులోగా బీఈడీ స్పాట్ అడ్మిషన్ ప్రవేశాల ర్యాటిఫికేషన్ చేయించకుంటే ప్రతి విద్యార్థి రూ.2వేలు చెల్లించాలన్న ఉన్నత విద్యామండలి ఆదేశాలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంత భారీ మొత్తం పెనాల్టీ విధించడం ఏమిటని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు నేరుగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డిని ఆదేశించింది. విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఆదేశాలిచ్చారు. 2022-23 బీఈడీ స్పాట్ అడ్మిషన్ ప్రవేశాల ర్యాటిఫికేషన్ కోసం తమ కాలేజీకి చెందిన 97మంది విద్యార్థుల పెనాల్టీ సొమ్ము, ఇతర ఖర్చులు కింద రూ.2.97 లక్షలు చెల్లించేందుకు అధికారులు వెబ్సైట్ ద్వారా అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన ఓ కాలేజీ కరస్పాండెంట్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు.