ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. జీఎస్టీ చట్టాన్ని అడ్డుపెట్టుకుని డీలర్లు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీల నుంచి భారీగా ముడుపులు అందుకున్నారని గుడివాడ సర్కిల్ జీఎస్టీవో కె.సంధ్య, జీఎస్టీవో మెహర్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ వెంకట చలపతి, సబార్డినేట్ సత్యనారాయణలను గత నెల 31వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఎఫ్‌ఐఆర్‌లో సూర్యనారాయణను ఐదో నిందితుడిగా చేర్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఈ నెల ఒకటో తేదీన సూర్యనారాయణ అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి సూర్యనారాయణ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. మరోపక్క తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న ప్రత్యేక బృందాలు సూర్యనారాయణను సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. సూర్యనారాయణ తమ అదుపులో లేరని పోలీసులు చెబుతున్నారు.