‘‘రాష్ట్రంలో అధికార వైసీపీతోపాటు టీడీపీ, జనసేన పార్టీలు స్వతంత్రను కోల్పోయాయి. రాష్ట్రంలో ఏం చేయాలన్నా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం పాత్ర కీలకంగా మారింది. దీంతో పై మూడు ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టాయి. సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ప్రజల చీత్కారానికి గురై.. ఉనికే లేకుండా పోయిన బీజేపీ ముందు సాగిలపడుతున్నాయి’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు అన్నా రు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడారు. ఆ పార్టీల అజెండాలనే మార్చేసుకుని చెప్పుల రాజకీయాలు చేస్తున్నారని, ఇంతకంటే ప్రమా దం మరొకటి లేదన్నారు. బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారమే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పని చేస్తుండటంతో రాష్ట్రం లో రాజకీయాలు పూర్తిగా అనిశ్చితిలో పడిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. పోలవరం ముంపు ప్రాంత నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం నుంచి జులై 4వరకు ‘పోలవరం పోరు యాత్ర’ నిర్వహిస్తున్నామని చెప్పారు.