ప్రజలు, రైతులపై భారాలకు కారణమైన విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా సీపీఎం నేతలు, కార్యకర్తలు సోమవారం నెల్లూరులో విద్యుత్‌భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. అలాగే మినీబైపాస్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద కూడా మరో బృందం నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించటం మానుకోవాలని, ట్రూఅప్ చార్జీల విధానాన్ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు విద్యుత్ చార్జీలను భారీగా పెంచిందన్నారు. అది చాలదన్నట్లు ఫిక్స్ చార్జీలతోపాటు కస్టమర్ చార్జీలను వసూలు చేయటం దారుణమని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో అల్లాడుతున్న ప్రజానీకంపై విద్యుత్ బిల్లుల భారం భరించలేని స్ధితిలో ఉందన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తల కిష్ణయ్య, నాగేశ్వరరావు, సూర్యనారాయణ, మూలం ప్రసాద్, కిన్నెర కుమార్, కొండా ప్రసాద్, అజీజ్, దేవతాటి సంపత్‌కుమార్, శివకుమారి, సంపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.