రాష్ట్రానికి విలన్ టీడీపీ నేత చంద్రబాబేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పన్నుల భారం మోపి, ఇష్టారీతిన విద్యుత్ చార్జీలు పెంచి, పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్ విధించి ప్రజలను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని మండిపడ్డారు. చంద్రబాబు పూర్తిగా అరాచక పాలన సాగించారని విమర్శించారు. ఇప్పుడేమో వైయస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధిని అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు విమర్శలను ఖండిస్తూ మంత్రి రజిని ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ చార్జీలు పెంచారని చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు విద్యుత్ చార్జీలను భారీగా పెంచిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా విద్యుత్ చార్జీల మోత మోగించేవారని గుర్తు చేశారు. 2015 ఫిబ్రవరిలో పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ.4 అదనపు వ్యాట్ విధించిన చరిత్ర చంద్రబాబుదన్నారు.