బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తనకు ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జగన్ నుంచి ప్రాణహాని ఉందని తాను ఎప్పుడో ఊహించానని.. పవన్ ఇప్పుడు తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్ అంటేనే విధ్వంసం.. అలాంటి వాళ్లు పవన్ కళ్యాణ్ ఎదుగుదలను సహించలేరన్నారు. బీజేపీతో కలిసి పనిచేయడం చూసి తట్టుకోలేక ఏమైనా చేస్తారన్నారు.
వీళ్లు అధికారం, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారని.. ఇప్పటికే 3, 4 లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ తాను పేదవాడిని అనడం విడ్డూరంగా ఉందన్నారు తనకు పేపర్లు, టీవీలు లేవంటూ జోకులు వేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే సీట్లు గెలవాలంటున్న జగన్ 25 ఎంపీ సీట్లు ఎందుకు వదిలిపెట్టారో అర్థం కాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విధ్వంసానికి నిలయంగా మారిందని.. జగన్ మనుషులు కోడిని కోసినంత సులభంగా హత్యలు చేయగలరన్నారు.
విశాఖలో అమిత్‌షా వ్యాఖ్యలతో వైఎస్సార్‌సీపీ భయపడింది అన్నారు. జగన్ అవినీతి, దౌర్జన్యాలకు బీజేపీ చెక్ పెట్టే సమయం వచ్చిందని.. విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ డ్రామా, బాపట్ల జిల్లాలో పదోతరగతి విద్యార్థి సజీవ దహనం వంటి సంఘటనలు రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా స్పందించని నాయకుడు రాష్ట్రానికి అవసరమా అన్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలనలో పవన్‌కు కేంద్రం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.. వెంటనే ఆయనకు భద్రత కల్పించేలా చూడాలి అన్నారు.
రాష్ట్రంలో సాక్షాత్తూ ఎంపీ కుటుంబానికే రక్షణ లేదన్నారు జనసే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తన అక్కను వేధిస్తున్నారని నిలదీస్తే 14 ఏళ్ల బాలుడిని పెట్రోలు పోసి తగలబెట్టేశారని బాపట్ల జిల్లా ఘటనను గుర్తు చేశారు. నేరగాళ్లు రాజ్యమేలితే శాంతిభద్రతలు ఇలాగే క్షీణిస్తాయని.. అన్నవరం నుంచి గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, కాకినాడ పోర్టు, కోటిపల్లి, నరసాపురం మీదుగా రేపల్లె వరకు రైల్వేలైన్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కొందరు ప్రస్తావించారు. కోస్తా రైలు మార్గం అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానన్నారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో పాలకులు బాధ్యతగా వ్యవహరించకపోతే.. యంత్రాంగం కూడా సక్రమంగా పనిచేయదన్నారు జనసేనాని. చిన్న పరిశ్రమ ఏర్పాటుకూ ఏళ్ల తరబడి అనుమతులు రావని.. ప్రతికూల పరిస్థితులతో ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోతున్నారన్నారు. ఈ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను పూర్తిగా చంపేసిందని.. తాను ముఖ్యమంత్రిలా నోటికొచ్చిన హామీ ఇచ్చి వదిలేయను అన్నారు. జనసేన సుపరిపాలన ప్రతి వర్గానికి జవాబుదారీగా ఉంటుందన్నారు.