నంద్యాల జిల్లా చాగలమర్రిలో నగ్న పూజల ఘటన ఆలస్యంగా బయటపడింది. స్థానికంగా ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. అతడిని గమనినించిన రుద్రవరం మండలం ముత్తలూరుకు చెందిన బత్తలూరి లక్ష్మి నాగమ్మ.. బాధితుడి భార్యను కలిసింది. 'నీ భర్తకు చేతబడి చేశారు' అని మాయ మాటలు చెప్పింది. చేతబడి విరుగుడుకు పూజలు చేయాలని ఆమెను నమ్మించింది.. భర్త ఆరోగ్యం ముఖ్యమని భావించిన భార్య కూడా ఆమె మాటలు నిజమని నమ్మింది.. పూజలు చేయడానికి అంగీకరించింది. పూజల పేరుతో బాధిత మహిళ నుంచి రూ.3 లక్షలు వసూలు చేసింది.
పూజలు నిర్వహించిన తర్వాత కూడా అతడి ఆరోగ్యం మెరుగు కాలేదు. దీంతో మాయ లేడి చేతబడి బలంగా చేశారని.. తన కంటే పెద్ద స్వామి దగ్గర పూజ చేయాలని మరోసారి నమ్మించింది. నంద్యాల సమీపంలో చాబోలుకి చెందిన పోలూరు మహమ్మద్ హుస్సైన్‌ని పిలిపించి బాధిత మహిళకు పరిచయం చేసింది. మహమ్మద్ హుస్సైన్ కూడా మాయమాటలు చెప్పి పూజల పేరుతో బాధిత మహిళ నుంచి మరో రూ.6 లక్షలు వసూలు చేశాడు. పూజల్లో భాగంగా బాధితురాలిని, ముగ్గురు కుటుంబ సభ్యులను ఒకరికి తెలియకుండా ఒకరిని పూజల పేరు తో బయపెట్టి నగ్న పూజలు చేయించాడు.
బాధిత మహిళ ఇదేంటని నిలదీయగా ఆమెను బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె తప్పించుకుని చాగలమర్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రుద్రవరం మండలం ముత్తలూరుకు చెందిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా మూఢనమ్మకాల పేరుతో అపద్దపు పూజలు, నగ్న పూజలు, చేతబడి, బాణామతి, లంకె బిందెలు వెలికి తీస్తాము అనే మాయమాటలు ఎవరైనా చెబితే ప్రజలు ఎవరు కూడా నమ్మి మోసపోవద్దన్నారు. ఎవరైనా మాయ మాటలు చెబితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
మరోవైపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోరీ కలకలంరేపింది. శ్రీలక్ష్మీనరసింహ జ్యువెలర్స్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. యజమాని రాఘవేంద్రాచారి సోమవారం షాపు తెరిచి తన సంచిలో తెచ్చిన బంగారాన్ని ఉంచి గుడికి వెళ్లారు. ఆ సమయంలో గుమస్తా షాపును శుభ్రం చేస్తున్నాడు. ఇంతలో ఓ యువకుడు వచ్చి చెప్పుల్ని షాపు దగ్గర నుంచి ఎవరో విసిరేశారని చెప్పాడు. అతడు షాపు బయటకు వచ్చి చూస్తే చెప్పులు దూరంగా పడి ఉన్నాయి.
ఇంతలో ఆ యువకుడు షాపులోకి వెళ్లి ప్రవేశించి బంగారం, డబ్బులు ఉంచిన సంచి తీసుకొని అక్కడ నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత యజమాని షాపులోకి వచ్చి చూస్తే సంచి కనిపించలేదని గుమస్తాను ప్రశ్నించాడు.. షాపు దగ్గరకు ఓ యువకుడు వచ్చినట్లు అతడు చెప్పాడు. దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు షాపులో సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. యువకుడు టోపీ పెట్టుకుని షాపులోకి వెళ్లి బంగారం మూటతో పారిపోయిన సీన్ అక్కడ కనిపించింది. రోజూ రాత్రి షాపులో బంగారం ఇంటికి తీసుకెళ్లి.. మళ్లీ ఉదయం షాపుకు తీసుకొస్తాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడు వ్యాపారిని అనుసరించి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఇదే షాపులో చోరీ జరిగింది. షాపు వెనుక రంధ్రం పెట్టి బంగారం బంగారం చోరీ చేశారు.