గోడపై రాసిన నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా విశాఖ తగరపువలసలో సంచలనంరేపిన వివాహిత హత్యకేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. గోడపై రాసిన నాలుగు అంకెలు పోలీసులకు క్లూగా మారాయి.. నిందితుడ్ని పట్టించాయి. కేరళకు చెందిన ప్రదీశ్ ఆరేళ్ల క్రితం విశాఖ వచ్చాడు.. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. చిప్పాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన వివాహితతో పరిచయం ఏర్పడింది.. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఆమెను ఈనెల 11న తన ఇంటికి తీసుకెళ్లి ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ప్రదీశ్ మద్యం సేవించి ఉన్నాడు.. ఆ మత్తులో ఆమెను భవనం పైనుంచి కిందికి తోసేశాడు. మళ్లీ మెడకు చున్నీ బిగించి దారుణంగా హతమార్చాడు. ఆమె అవయవాలను దారుణంగా కోసేశాడు.. తర్వాత బెడ్‌షీట్‌లో చుట్టి తన బైక్‌పై తగరపువలస శివారు ఆదర్శనగర్ దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు.
ఆమె ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనచెందారు. ఆమె కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు.. ఇంతలో ఆమె మృతదేహం దొరికింది. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అతడు డెడ్‌బాడీని అక్కడ పడేసి తిరిగి వస్తున్న సమయంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఆ శబ్ధానికి స్థానికులు లేచారు.. వారికి ఎందుకో అనుమానం రావడంతో బైక్ నంబర్ గోడపై రాశారు. అతడి చెప్పులు కూడా అక్కడే ఉండిపోయాయి. ఆ తర్వాత ఆధారాలు సేకరించి ప్రదీశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు ఈ కేసు విచారణ దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని గుర్తించిన చోట గాలించారు. అప్పటికి ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. ఊరిలోకి వచ్చి ఆధారాల కోసం వెతికారు.. ఈ క్రమంలోనే ఓ గోడ మీద 3807 నంబర్ కనిపించింది.. పోలీసులకు అనుమానం రావడంతో ఆ కోణంలో విచారణ చేశారు. ప్రదీశ్ కిందపడిన విషయాన్ని స్థానికులు చెప్పారు. ఆ గోడపై రాసి ఉన్న నంబర్ ఆధారంగా నిందితుడు ఉపయోగించి బజాజ్ ప్లాటినా బైక్‌ను గుర్తించారు. బైక్ నంబర్ AP39 HK 3807గా గుర్తించారు. ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్థానికులు రాసిన బైక్ నిందితుడిని పోలీసులకు పట్టించింది. ఆ నాలుగు అంకెల నెంబరే పోలీసులకు కీలకమైన ఆధారంగా మారింది.