ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 20, 2023, 07:38 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ రాశారు. తాను స్వార్ధపరుడును.. కోట్లాది రూపాయలకు అమ్ముడు పోవడానికి ఉద్యమం చేయలేదన్నారు. తనకన్నా బలవంతులైన పవన్.. తాను వదిలేసిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇటీవల వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్‌ల గురించి ప్రస్తావిస్తూ.. రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదురుగుతున్నారంటూ కామెంట్ చేశారు. దీనికి స్ట్రాంగ్‌ కౌంటర్‌గా ముద్రగడ జనసేనానికి ఘాటుగా లేఖ రాశారు. తాను కులాన్ని అడ్డుపెట్టుకుని ఎప్పుడు పదవి పొందలేదని.. ఎప్పుడు ఓటమి ఎరుగని తాను కాపు ఉద్యమంతో ఓటమికి దగ్గర అయ్యానన్నారు పద్మనాభం. దీనిని బట్టి తాను కులాన్ని వాడుకున్నానో లేదో తెలుసుకోవాలని హితవు పలికారు.


ఈ లేఖ తాను రాసినందుకు ఎక్కడా లేని కోపం రావొచ్చు.. రాష్ట్రంలో అభిమానులు తనను తుది ముట్టించాలనే ప్రయత్నం చేయొచ్చు.. అయినా నిజాన్ని నిర్భయంగా రాయాలనిపించి రాయక తప్పలేదన్నారు. తాను కులాన్ని అడ్డం పెట్టుకుని నాయకుడుగా ఎదిగినట్లు.. యువతను వాడుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గుడుపుకుంటున్నానని.. ఉద్యమాన్ని ప్రభుత్వాలు మారినప్పుడల్లా చేయలేదని పవన్ సెలవిచ్చారన్నారు. చంద్రబాబు పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్‌ పునరుద్దరిస్తాను అని పదే పదే చెప్పడంతోనే రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వారి ద్వారా 'మీరే' కల్పించారన్నారు.


వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో.. జగ్గంపేట సభలో రిజర్వేషను అంశం తన చేతిలో ఉండదు కేంద్రం పరిధి అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాను సమాధానం ఇచ్చిన పదాలు ఏంటో అడిగి తెలుసుకోవాలన్నారు. తాను స్వార్ధపరుడను, కోట్లాది రూపాయలు సూట్ కేసులకు అమ్ముడు పోవడానికి ఉద్యమం చేయలేదన్నారు.. అమ్ముడు పోలేదన్నారు. తనకంటే చాలా చాలా బలవంతులైన పవన్.. తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్‌ ఫలాలు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలన్నారు. కులాన్ని అడ్డంపెట్టుకుని ఎప్పుడూ ఏ పదవి పొందలేదన్నారు.


ఎమ్మెల్యేను తిట్టడానికి సమయాన్ని వృధా చేసుకోవద్దని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ అమ్మకం నుంచి కాపాడడం, ప్రత్యేక లైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంటు వంటి సమస్యలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. వాటి గురించి ప్రయత్నం చేయమని 2019 ఎన్నికల ముందు తన దగ్గరకు పంపించిన రాయబారులకు సలహా ఇచ్చి పంపించాను అన్నారు. కానీ తనను సలహాలు అడిగి గాలికి వదిలేశారన్నారు. ఒకవేళ నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే తనలాంటివారిపై విమర్శలు ఆపి ప్రత్యేక కార్యాచరణ తయారు చేసుకుని రోడ్డు ఎక్కాలన్నారు.


పదిమందితో ప్రేమించబడాలి కానీ వీధి రౌడీ భాషలో మాట్లాడటం సరికాదన్నారు ముద్రగడ. రాజకీయాలలో అతి సామాన్యుడు తాలూకు ఇంటికి వెళ్ళి ఓట్లు అడుక్కోవాలి కానీ.. ఉద్యమాలలో అయితే ఎవరింటికి వెళ్లి సహాయం చేయమని అడగనవనరం లేదన్నారు. 'మనం చేసే ఉద్యమం మంచి కోసం చేస్తే కులాలకు అతీతంగా బలపరిచేవారు చాలా మంది ఉంటారు' అన్నారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు కానీ.. ఆయన మాట్లాడే భాష ఒక పార్టీ అధినేతగా మాట్లాడవలసినది కాదన్నారు.. దీని వల్ల నష్టం తప్ప లాభం లేదన్నారు.


పవన్ ప్రసంగాల్లో పదే పదే తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అనే పదాలు ఉపయోగిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకూ ఎంతమందికి తీయించి కింద కూర్చోబెట్టారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో చెప్పాలన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాత, తండ్రులు తప్పుడు మార్గాల్లో సంపాదించారనే మాట తప్పు అన్నారు. గతంలో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తే.. తాను తిరస్కరిస్తే ద్వారంపూడి కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి పదవి తీసుకుని పదిమందికి సాయం చేయమని సలహా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నో సందర్భాల్లో సాయం అందించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. అలాంటి వారిని విమర్శించడం సరికాదన్నారు.


రాజకీయాల్లో శాత్వత శత్రువులు, మిత్రులు ఉండరని.. కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి దొంగ అయితే రెండుసార్లు ఎలా గెలిచారని ప్రశ్నించారు. ఆయన్ను మరోసారి అసెంబ్లీకి వెళ్లకుండగా.. పవన్ కళ్యాణ్ ఆయనపై పోటీచేసి ఓడించాలన్నారు. బీజేపీ, టీడీపీలతో కలిసి పోటీ చేస్తామని పవన్ తరచూ చెబుతున్నారని.. అలాంటప్పుడు తనను ముఖ్యమంత్రిని చేయమని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయమని కోరాలన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com