ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న జయమ్మ కాలనీలో దస్తగిరి నివాసం ఉంటున్నాడు. అతడు అదే వీధికి చెందిన తన కుమారుడు గూగుడువల్లిని నిర్బంధించి, చిత్రహింసలు పెట్టాడని తల్లి కుళ్లాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కాపాడాలంటూ పోలీసుల్ని కోరింది.
పోలీసులు వెంటనే దస్తగిరి ఇంటికి వెళ్లి.. నిర్బంధించిన బాలుడిని విడిపించి పులివెందులలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు చికిత్స అందించిన తర్వాత బాలుడిని స్టేషన్‌కు తీసుకెళ్తుండగా పోలీసుల వాహనాన్ని బాధితుడి బంధువులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాలుడి గురించి తెలియగానే బాధితుల బంధువులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఆస్పత్రి దగ్గరకు వచ్చారు.
ఆరు నెలల క్రితం కుటుంబ అవసరాల కోసం తన భర్త పెద్దగూగుడువల్లీ, తాను కలిసి దస్తగిరి దగ్గర వడ్డీకి రూ.40 వేలు అప్పు తీసుకున్నట్లు బాలుడి తల్లి కుళ్లాయమ్మ అన్నారు. తాము ఆ డబ్బులకు వారం వారం వడ్డీ చెల్లిస్తున్నామని.. పది రోజుల నుంచి డబ్బులు సక్రమంగా కట్టకపోవడంతో తమ కుమారుడిని సోమవారం మధ్యాహ్నం దస్తగిరి తన వెంట తీసుకెళ్లాడని చెప్పారు. దస్తగిరి తన కుమారుడిని ఇంట్లోనే నిర్బంధించాడని.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించినట్లు కుళ్లాయమ్మ చెప్పారు.
దస్తగిరి తనను ఇంట్లోనే నిర్బంధించి హింసించాడని బాలుడు గూగుడువల్లీ పోలీసులకు చెప్పాడు. బాలుడి తల్లి కుళ్లాయమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. దస్తగిరిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. తమపై అన్యాయంగా ఫిర్యాదు చేశారని దస్తగిరి, అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అంతేకాదు దస్తగిరి ఇటీవల సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ మధ్య చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో.. ఇటీవల అన్నమయ్య జిల్లాలో తనకు కేటాయించిన గన్‌మెన్‌లతో వెళ్లి షాపుల ముందు కూర్చున్నాడు. ఓ షాపు గురించి వెళ్లిన దస్తగిరి.. ఆ స్థలనం తనదే అంటూ యమాజనుల్ని బెదిరించినట్లు ఆరోపించారు. తమను బెదిరించి షాపులకు తాళాలు వేసినట్లు చెప్పుకొచ్చారు.
దస్తగిరి ఆ షాప్ ముందు కూర్చొని మాట్లాడుతున్న సమయంలో వీడియో తీయగా.. వైరల్ అయ్యాయి. ఏకంగా గన్‌మెన్‌లను తీసుకెళ్లి మరీ దాదాగిరి చేశారంటూ కొందరు కామెంట్ చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.. మళ్లీ ఇప్పుడు బాలుడిని హింసించినట్లు కేసు నమోదైంది.