ప్రియుడితో జంప్ అయ్యేందుకు కిడ్నాప్ డ్రామా ఆడింది ఓ 17 ఏళ్ల అమ్మాయి. రోజూ లాగే ఆ అమ్మాయి ఉద్యోగానికి వెళ్లింది. సాయంత్రం సమయం అయిపోయిన తర్వాత కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ కుమార్తె కోసం ఆ తల్లిదండ్రులు కనపడిన చోటల్లా వెతికారు. ఇంతలో వారికో వాయిస్ మెసేజ్ వచ్చింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని.. ఆ యువతి మాటలు వారికి వినపడ్డాయి. పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేయగా.. అసలు విషయం బయట పడింది. ఆ యువతి కిడ్నాప్ కాలేదని.. ప్రియుడితో కలిసి పారిపోయిందని గుర్తించారు. అనంతరం వారిద్దరి ఆచూకీ కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక విరార్ ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల యువతి ఒక కంపెనీలో హౌస్ కీపింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోంది. రోజూ లాగే శుక్రవారం ఉద్యోగానికి వెళ్లిన ఆ యువతి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమె కోసం కనిపించిన చోటల్లా గాలించారు. ఇంతలో ఆ యువతి తన సోదరుడికి వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపించింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని ఎక్కడికో తీసుకెళ్తున్నారని వాయిస్ మెసేజ్‌లో వెల్లడించింది. ఈ వాయిస్ మెసేజ్‌తో మరింత భయాందోళనకు గురైన ఆ యువతి కుటుంబ సభ్యులు హుటాహుటిన దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై విరార్ ప్రాంత పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. యువతి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు సాంకేతిక ఆధారాలను సేకరించారు. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా సిగ్నల్స్, వారి లొకేషన్ గుర్తించారు. సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత యువతిది కిడ్నాప్ కాదని తేల్చారు. కావాలనే ఆ యువతి ప్రియుడితో పారిపోయిందని గుర్తించారు. ఇద్దరూ కలిసి విమానంలో ముంబై నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు పారిపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో కొంతమంది పోలీసులు బృందంగా ఏర్పడి కోల్‌కతాకు వెళ్లారు. యువతి, ఆమె ప్రియుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.