ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందే భారత్ రైలు టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తికి షాక్,,,మామూలు ట్రైన్‌లో పంపించిన రైల్వే శాఖ

national |  Suryaa Desk  | Published : Tue, Jun 20, 2023, 09:11 PM

వందే భారత్ రైలు.... . మామూలు రైళ్లతో పోలిస్తే ఖరీదైన టికెట్ కాగా.. వేగం, ఇతర సౌకర్యాలు చూసి ప్రయాణికులు ఇందులో ప్రయాణించేందుకు ఎగబడుతున్నారు. అయితే అదే ఉత్సాహంతో ఓ వ్యక్తి.. వందే భారత్ ట్రైన్‌లో ఒక టికెట్ బుక్ చేసుకున్నాడు. మొదటిసారి వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్నానని సంతోషంగా రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. తీరా చూస్తే ఆ వందే భారత్ ట్రైన్ స్థానంలో మామూలు ట్రైన్ వచ్చింది. అందులో సౌకర్యాలు కూడా సరిగా లేవు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆ వ్యక్తి ఆ ట్రైన్‌లో ఉన్న చెత్తా చెదారం, టాయిలెట్లలో నిండిన నీరు, సీట్ల ఫొటోలు, వీడియోలు తీసి రైల్వే మంత్రి, ఇతర అధికారులకు పంపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.


సిద్ధార్థ్ పాండే అనే వ్యక్తి తొలిసారి వందే భారత్‌ ట్రైన్‍లో ప్రయాణించాలని భావించాడు. అందులో భాగంగానే న్యూఢిల్లీ నుంచి మాతా వైష్ణోయ్‌ దేవి వరకు నడిచే వందే భారత్‌ రైలుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. మొదటిసారి వందే భారత్‌ రైలులో ప్రయాణించేందుకు ఎంతో ఉత్సాహంగా డంపై జూన్‌ 10న రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే ఆ సమయానికి వందే భారత్ ట్రైన్ రాలేదు. ఆ స్థానంలో తేజస్ ఎక్స్‌ప్రెస్ వచ్చి రైల్వే స్టేషన్‌లో వచ్చి ఆగింది. దీంతో చేసేదేమీ లేక ఆ రైలు ఎక్కేశాడు. లోపలికి వెళ్లి చూసి.. సిద్ధార్థ్ పాండే అవాక్కయ్యాడు.


వందే భారత్ ట్రైన్‌లో వెళ్లాల్సిన సిద్ధార్థ్ పాండే చివరికి తేజస్ రైలు ఎక్కాడు. సరే ఆ రైలు అయినా బాగుంటుందా అనుకుంటే అక్కడా నిరాశే ఎదురైంది. ఆ తేజస్ రైలులోని సరిగా లేని సీట్లు, టాయిలెట్స్‌లో నిండిపోయిన నీరు, చెత్తా చెదారంతో కూడిన ఆ రైలును చూసి తీవ్ర అసహనం, అసంతృప్తి చెందాడు. ఈ ప్రయాణంలోని అనుభవాలని సిద్ధార్థ్‌ పాండే ట్విట్టర్‌లో పంచుకున్నాడు. తొలిసారి వందే భారత్‌ రైలులో ప్రయాణించడానికి ఎంతో ఉత్సాహంగా వచ్చిన తాను ఆ స్థానంలో వచ్చిన మరో రైలును చూసి షాకైనట్లు వెల్లడించాడు. దారుణమైన టాయిలెట్లు.. చాలా అధ్వాన్నమైన సేవలతో ఆ తేజస్ రైలు చెత్త చెత్తగా ఉందని తెలిపాడు. ఆ రైలులోని సీట్లు, టాయిలెట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ట్విటర్‌లో పోస్టు చేశాడు. అయినప్పటికీ వందే భారత్‌ రైలుకు వసూలు చేసిన ఛార్జీలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. భారతీయ రైల్వేతోపాటు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ప్రధాని కార్యాలయానికి.. ఈ ఫొటోలు, వీడియోలు ట్యాగ్ చేశాడు.


మరోవైపు సిద్ధార్థ్ పాండే ట్వీట్‌ రైల్వేల్లో అందుతున్న సేవలపై చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా వివిధ సమయాల్లో తమకు రైల్వేల విషయంలో ఎదురైన అనుభవాలను కొందరు నెటిజన్లు పంచుకున్నారు. తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న రైళ్లు లేదా ఏసీ కోచ్‌లకు బదులుగా వేరేవి నడుపుతున్నారని కొందరు విమర్శించారు. ఇదో కుంభకోణమని మరికొందరు ఆరోపించారు. రైల్వే చేస్తున్న ఈ మోసం, దోపిడీని ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. ఈ ఘటనపై సిద్ధార్థ్‌ పాండే చేసిన ఫిర్యాదు విషయంలో రైల్‌ సేవా స్పందించింది. అతని నుంచి వివరాలు సేకరించిన రైల్ సేవా.. సంబంధిత అధికారి దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు ట్విట్టర్‌లో బదులిచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com