ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ ప్రఖ్యాత గాంచిన పూరీ రథయాత్ర,,,,పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 20, 2023, 09:12 PM

ఒడిశాలోని ప్రముఖ శ్రీ క్షేత్రం పూరీ జగన్నాథుని రథయాత్రకు సర్వసిద్దమైంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 9 గంటలలోపు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తరువాత మంగళహారతి ఇస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ రథాలపై బంగారు చీపురుతో ఊడ్చిన రథయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రంలోగా రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సారి 10 లక్షల మంది వస్తారని అంచనా.


ఇక, నందిఘోష్‌, తాళధ్వజ, దర్పదళన్‌ రథాలు సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన కార్డన్‌ వద్దకు చేరుకున్నాయి. దీనికి ముందుగా అర్చకులు ఆలయం నుంచి జగన్నాథుడి మెడలోని పూల మాలలు తెచ్చి మూడు రథల మధ్య ఉంచి పూజలు చేశారు. ఆ తరువాత హరిబోల్‌ నినాదాల మధ్య పోలీసులు, భక్తులు కలిసి శ్రీక్షేత్ర కార్యాలయం నుంచి జగన్నాథ సన్నిధి వరకు రథాలు లాక్కెళ్లారు.


మరోవైపు, బిడ్డల రాకకోసం ఎదురు చూస్తున్న గుండిచాదేవి మందిరానికి సర్వంగ సుందరంగా అలంకరించారు. ఇక, సోమవారం ఉదయం నుంచి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. అన్ని రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. సాయంత్రానికే పూరీ జనసంద్రంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసింది. బారికేడ్లను ఏర్పాటు చేసి, వాహనాలు రాకపోకలు నియంత్రిస్తున్నారు. ఆయాచోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.


సచ్ఛిదానంద స్వరూపుడు జగన్నాథుడు రథాలపై భక్తుల మధ్యకు వచ్చి, పెంచిన తల్లి (గుండిచాదేవి) ఆలయానికి వెళతాడు. 9 రోజులు అమ్మ పెట్టే గోరుముద్దలు ఆరగిస్తాడు. మంగళవారం నిర్వహించే ఈ యాత్రను దివి నుంచి దేవతలూ వీక్షిస్తారు. పురుషోత్తముని నిలయమైన పూరీని భక్తులు వైకుంఠపురంగా అభివర్ణిస్తారు. స్వామి కొలువుండే శ్రీక్షేత్రం శైవ, వైష్ణవ, శాక్తేయుల నిలయం. ఎంతోమంది రుషులు, మనులు, మహాత్ములు, సిద్ధయోగులకు జ్ఞానోదయం చేసిన మహోన్నత ధామం ఇది. సృష్టి, స్థితి, లయ కారకుడైన జగన్నాథుడు సర్వాంతర్యామి. ఆలయంలో ఆయనకు చేసే సేవల్లో అర్థం, పరమార్థం ఇమిడి ఉంటాయి. తన లీలలతో ఆయన మానవాళికి దివ్య సందేశం ఇస్తాడని తత్వ సంపన్నులంటారు.


పూరీ ఆలయ గర్భగుడిలో జగన్నాథుడు తన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రలతో కొలువుదీరి ఉంటాడు. ఈ ముగ్గురు మూర్తలకు కొంత దూరంలో మహాలక్ష్మి ఆలయం ఉంటుంది. రథయాత్రలో మహాలక్ష్మిని వెంట తీసుకెళ్లని జగన్నాథుడు తన సోదరుడు, సోదరితో కలిసి వెళతాడు. ఇది అన్నాచెల్లెళ్ల అనుబంధం, రక్త సంబంధం విలువను మనవాళికి తెలియపరడం స్వామి ఉద్దేశమని భక్తుల నమ్మకం. తత్వవేత్తలు మాత్రం.. శ్రీమన్నారాయణుడే జగన్నాథుడని, శివుడే బలబధ్రుడని, దేవీ సుభద్ర బ్రహ్మ స్వరూపమని పేర్కొంటున్నారు. ఈ ముగ్గురు త్రిమూర్తులు, త్రిగుణాతీతులని చెబుతారు. దేవీ సుభద్రను ఆదిపరాశక్తిగాను మరికొందరు అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com