ఏపీ ప్రజల్లో మార్పు మొదలైందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఓటింగ్‌కి దూరంగా ఉండేవారంతా ఈసారి కచ్చితంగా పోలింగ్ బూత్‌లకు వస్తారని ధీమాను వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలవడం, జగన్ అధికారంలోకి రావడం మంచిదైంది అని వ్యాఖ్యానించారు. పవన్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక అవినీతిపరుడు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరికీ అనుభవం అయ్యిందన్నారు. మరోసారి ప్రజలు అలాంటి వ్యక్తిని గెలిపించకూడదని భావిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలవు అన్నారు.
జగన్‌లాంటి దారుణమైన పాలకుడిని ఓడించేందుకు ఎవరితోనైనా కలిసి పని చేయాల్సిందే అన్నారు పవన్. పార్టీల అంతిమ లక్ష్యం రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పాలన లేకుండా చేయడమేనని.. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి అధికార పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాయి అన్నారు. పార్టీల మధ్య కొన్ని సర్దుబాట్లు, రాజీలు, త్యాగాలు తప్పవు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓట్లు 14 నుంచి 18 శాతం తగ్గుతాయి అన్నారు. వైఎస్సార్‌సీపీ ఓట్ల శాతం 38-39కి పడిపోతుంది అన్నారు. జనసేనకు ఓట్ల శాతం పెరిగిందంటే మిగతా పార్టీల్లో ఏదో ఒకదానికి తగ్గాలి.. ప్రధానంగా అధికార పార్టీకే తగ్గుతుందని అంచనా వేశారు.
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పాలన ఉండకూడదని.. ప్రతిపక్ష పార్టీలు కలిసి పని చేయబోతున్నాయన్నారు. ప్రజలు మార్పునకు.. ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు రావాల్సి ఉందని.. ఇగోలకు వెళ్లకూడదు అన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రం గెలవాలి, పార్టీలు కాదు. విద్యావంతులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు.. అంతా స్వార్థం వదిలి ఇలాంటి సమయంలో రాష్ట్రం కోసం పోరాడాలి అన్నారు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించకపోతే తనను చంపేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ఇంటెలిజెన్సు వాళ్లూ చెప్పారన్నారు. మొన్నటి విశాఖ పర్యటనలో ఇలాంటి ప్రయత్నం జరిగిందని.. పెద్ద గొడవ సృష్టించబోతున్నారని తనకు ముందే సమాచారం ఉందన్నారు. గొడవలు చేయడానికి ఏర్పాట్లు చేసి.. ఆ హడావుడిలోనే తన ప్రాణాలు తీయాలని ప్లాన్ చేశారన్నారు. ధనికులు, పేదల మధ్య యుద్ధం అంటూ క్లాస్‌వార్ గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు.
2014 నుంచి వైఎస్సార్‌సీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అన్నారు పవన్. 2019లో వైఎస్సార్‌సీపీ వాళ్లు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. ఖర్చు చేసిన దానికి రెండు వందల రెట్లు సంపాదిస్తామని అంటున్నారన్నారు. 'మన కులం వాడంటూ వాళ్లు ఓట్లు వేశారు. దాన్ని అవకాశంగా తీసుకుని మరికొందరు సపోర్టు చేశారు' అన్నారు. భయపడో, అవకాశవాదంతోనో, ఇష్టపడో ఆ పార్టీకి 151 సీట్లు ఇచ్చారని.. పాము అధికారంలోకి రాగానే పక్కవాళ్లందర్నీ తినేసి, ఆ తర్వాత సొంత గుడ్లనూ తినేసింది అన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు. తాను సినిమాలు చేస్తుంది పార్టీ కోసమే అన్నారు. తాను సీఎం కావాలని జనసేన పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని.. అందుకే తాను సీఎంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జనసేన కార్యకర్తలకు చెప్పానన్నారు పవన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa