కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు 2024 జనవరి 14 తేదీన మకర సంక్రాంతి రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ సందర్భంగా 10 రోజుల పాటు ఆచార వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ మహత్తర కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. రామ మందిర ప్రారంభోత్సవం, ప్రతిష్ఠాపన కార్యక్రమాలను దేశ, విదేశాల్లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నృపేంద్ర మిశ్రా స్పష్టం చేశారు.
రామాలయ నిర్మాణంలో భాగంగా ఈ ఏడాది అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. నాలుగు అంతస్తుల ఆలయం పూర్తయ్యాక గ్రౌండ్ ఫ్లోర్‌ను రామ్ కథ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేస్తామని వెల్లడించారు. 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించి ఉంది. మొత్తం ఐదు మండపాలు ఉంటాయి. గర్భగుడిపై 161 అడుగుల టవర్‌గా ఉండే ఈ నిర్మాణం కోసం రాజస్థాన్‌కు చెందిన నాలుగు లక్షల క్యూబిక్ అడుగుల పాలరాయిని ఉపయోగించనున్నారు. ఇందులో ఎలాంటి స్టీల్ గానీ, ఇటుకలను ఉపయోగించ లేదు. రామాలయ నిర్మాణం నగారా శైలిలో ఉంటుందని.. దానికి 46 టేకు చెక్క తలుపులు ఉంటాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. గర్భగుడికి ఉండే ప్రధాన ద్వారం బంగారు పూతతో ఉంటుందని.. ఈ ఆలయ నిర్మాణం కనీసం వెయ్యి సంవత్సరాల పాటు నిలుస్తుందని వెల్లడించారు.
ప్రధాన ఆలయాన్ని మూడు ఎకరాల్లో నిర్మించనున్నారు. ఈ ఆలయానికి చుట్టుప్రక్కల 9 ఎకరాల విస్తీర్ణంలో గోడ నిర్మించనున్నారు. గోడపై రామాయణాన్ని తెలిపే శిల్పాలు ఉంటాయి. ఆలయానికి ఉన్న మూడు ద్వారాలు, గోపురానికి బంగారు పూతను పూయనున్నారు. నిర్మాణం పూర్తైన తర్వాత ఆలయ సముదాయంలో యాత్రికులు ఉండేందుకు కేంద్రం, మ్యూజియం, ఆర్కైవ్‌లు, పరిశోధనా కేంద్రం, ఆడిటోరియం, గోశాల, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక స్థలం, ఆలయ అధికారుల కోసం పరిపాలనా భవనాలు, ఆలయ పూజారులకు వసతి గృహాలు ఉంటాయి.