విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఓ దంపతులు ఆశ్రయించారు. దీంతో కేసు విచారణలో భాగంగా పెండింగ్‌లో ఉంది. కేసు పూర్తయ్యే వరకు భార్యకు నెలకు రూ. 5 వేల చొప్పున భరణంగా చెల్లించాలని భర్తకు సూచిస్తూ కోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చింది. అయితే 11 నెలలు గడిచినా భర్త భరణం సొమ్ము ఇవ్వడం లేదంటూ ఆయన భార్య మళ్లీ కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో ఆ వ్యక్తి రూ.55 వేలను రూపాయి, రూ.2 నాణేల్లో తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి చూపించిన అతి తెలివికి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
జైపుర్‌లోని హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్ కుమావత్‌కు కొన్ని సంవత్సరాల క్రితం సీమా అనే మహిళతో వివాహం జరిగింది. వీరి ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందు కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఇరువురి వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు కేసును పెండింగ్‌లో ఉంచింది. అయితే భర్తతో విడిపోయి దూరంగా ఉంటున్న సీమా కుమావత్‌కు నిర్వహణ ఖర్చుల కింద ప్రతినెలా రూ.5 వేలు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు దశరథ్‌కు ఆదేశాలు జారీ చేసింది.
అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాలను దశరథ్ బేఖాతరు చేశాడు. 11 నెలలు పూర్తయినా ఒక్క నెల కూడా అతడు నిర్వహణ ఖర్చులను భార్యకు ఇవ్వలేదు. చూసీ చూసీ విసుగు చెందిన సీమా.. మళ్లీ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో దశరథ్‌పై కోర్టు రికవరీ వారెంట్ జారీ చేసింది. అయినప్పటికీ నిర్వహణ ఖర్చులను చెల్లించేందుకు దశరథ్ నిరాకరించడంతో జూన్ 17న దశరథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కోర్టుకు సెలవులు ఉండటంతో చివరకు మంగళవారం అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. దశరథ్ అరెస్టు కావడంతో అతడి కుటుంబ సభ్యులు సీమాకు చెల్లించాల్సిన డబ్బులను కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. రూ. 55 వేలను రూపాయి, రూ.2 నాణేల రూపంలో ఏడు సంచుల నిండా కోర్టుకు తీసుకొచ్చారు.
అయితే ఈ 7 సంచుల చిల్లర నాణేలను తీసుకునేందుకు సీమా నిరాకరించారు. తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తోనే ఇలా బస్తాల్లో నాణేలను తీసుకొచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నాణేల రూపంలో దశరథ్ తీసుకువచ్చిన డబ్బులను తీసుకోవాలని సీమాను కోర్టు ఒప్పించింది. అయితే ఇక్కడే మరో తిరకాసు పెట్టింది. ఆ 7 సంచుల చిల్లర నాణేలను దశరథ్ ఒక్కడే లెక్కపెట్టాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను జూన్ 26 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకు ఆ 7 సంచుల చిల్లర నాణేలు కోర్టు ఆధీనంలోనే ఉంటాయని స్పష్టం చేసింది. జూన్ 26 తేదీ రోజున ఆ డబ్బును దశరథ్ లెక్కించి రూ.1000 చొప్పున ఒక్కో ప్యాకెట్‌గా కట్టి పెట్టాలని సూచించింది. ఆ ప్యాకెట్లు అన్నింటినీ కోర్టు సమక్షంలోనే ఆయన భార్య సీమాకు అందజేయాలి అని జడ్జి స్పష్టం చేశారు. కోర్టు సమక్షంలోనే భార్యకు ఝలక్ ఇవ్వాలని భావించిన భర్తకు.. జడ్జి మంచి శిక్ష విధించారని విషయం తెలిసిన వాళ్లు అంటున్నారు.