మనం విచిత్రంగా పెళ్లిళ్లు రద్దు అవ్వడం చూస్తుంటాం. ఇదిలావుంటే వరుడు దేశ ప్రధాని పేరు చెప్పలేకపోయాడని తీవ్ర అవమానంగా భావించిన వధువు పెళ్లైన మర్నాడే అతడికి కటీఫ్ చెప్పింది. అంతటితో ఆగకుండా తన కంటే వయసులో చిన్నవాడైన పెళ్లి కొడుకు తమ్ముడ్ని బలవంతంగా పెళ్లాడింది. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపుర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే సయ్యద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నసీర్‌పూర్ గ్రామంలోని రామ్ అవతార్ కుమారుడు శివశంకర్ (27)కు.. బసంత్ పట్టికి చెందిన లాాకేధ్ రామ్ కుమార్తె రంజనతో జూన్ 11న వివాహం జరిగింది. ఆరు నెలల కిందటే ఈ వివాహం కుదరడంతో నిశ్చాతార్ధం చేసుకున్నారు.
అయితే, వివాహం ముగిసిన మర్నాడు జూన్ 12న ఉదయం.. పెళ్లివేడుకలో భాగంగా వధువు ఇంట్లో ఓ చిన్న కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో వరుడు శివశంకర్ తన మరదలు, బావమరిదితో సరదాగా మాటలు కలిపాడు. ఉన్నట్టుండి దేశ ప్రధాని ఎవరు? మరదలు వేసిన ప్రశ్నకు శివశంకర్ సమాధానం చెప్పలేక తెల్లమొహం వేశాడు. ఇది చూసిన వధువు బంధువులు అతడ్ని హేళన చేశారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన వధువు.. అతడు తనకొద్దని తెగేసి చెప్పింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు శివశంకర్ తమ్ముడైన అనంత్‌ను బెదిరించి ఆమెతో పెళ్లి జరిపించారు.
రంజన కంటే వయసులో చిన్నవాడైన అనంత్‌కు పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బలవంతంగా అక్కడికక్కడే తాళి కట్టించారు. అనంతరం వధువును అత్తారింటికి పంపారు. కానీ, రెండు రోజుల తర్వాత రంజన కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో వరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీనిపై స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో వివాదం చెలరేగిందని తెలిపారు. అయితే, దీనిపై ఎవరూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.