బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవికి చెందిన షేక్ జాస్మిన్ అనే యువతి 2016 జూలై 17న తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు వచ్చే సమయానికి అదే గ్రామానికి చెందిన వేముల షణ్ముఖశ్రీసాయి, జొన్నా పవన్ కుమార్ అనే మిత్రులు అక్కడే ఉన్నారు. దీంతో వారే ఆమెను హత్యచేసి, తర్వాత ఉరివేశారని భావించారు. దీంతో వారిద్దరినీ చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీసాయి మరణించగా.. పవన్‌కుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు. పవన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదుచేశారు. విచారణ సందర్భంగా.. జాస్మిన్ ఫోన్‌చేసి, తనకు వివాహం నిశ్చయం చేశారని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పిందని, ఆమెను కాపాడేందుకే ఇంటికి వెళ్లామని పవన్ చెప్పాడు. ఉరివేసుకున్న ఆమెను దింపి రక్షించే ప్రయత్నంలో ఉండగా ఆమె తల్లిదండ్రులు వచ్చి తామే హత్య చేశామని భావించి కొట్టారని తెలిపాడు. దీనిపై మొత్తం 21 మందిపై కేసు నమోదు చేయగా, వారిలో నలుగురు గతంలోనే చనిపోయారు. మరో నలుగురు మహిళలను నిర్దోషులుగా విడుదల చేశారు. మిగిలిన 13 మందిపై నేరం రుజువు కావడంతో తెనాలిలోని 11వ అదనపు జిల్లా కోర్టు జడ్జి జీ మాలతి బుధవారం తుది తీర్పు వెల్లడించారు. 13 మందికి జీవిత ఖైదుతోపాటు, రూ.52వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.