కాకినాడ కస్టమ్స్ అధికారులకు గంజాయి స్మగ్లర్‌లు పట్టుబడ్డారు. అనంతరం అధికారులు నిందితుల నుంచి రూ.85.73 లక్షలు విలువ చేసే 428.68 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ కస్టమ్స్ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో ఐషర్ వ్యాన్ ద్వారా స్మగ్లింగ్ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్ రిషీగోయల్‌కు వచ్చిన పక్కా సమాచారంతో ఆయన ఆదేశాల మేరకు కస్టమ్స్ బృందం అప్రమత్తమై వాహన తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఐషర్ వాహనాన్ని కస్టమ్స్ బృందం ఆపి తనిఖీ చేసింది. ఈ తనిఖీలో అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకుని వ్యాన్‌ను సీజ్ చేసి ఇద్దరు స్మగ్లర్‌లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టమ్స్ అధికారుల అభ్యర్థన మేరకు నిందితులు ఇద్దరిని కస్టడీకి ఇస్తూ కొవ్వూరు రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.