భార్యను హత్య చేసిన భర్తకు శిక్ష విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. అలానే భర్తకు సహకరించిన మరొక వ్యక్తికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 19 జూన్ 2019న వేట్లపాలెంలో జరిగిన ఈ కేసుకు సంబంధించి బుధవారం రాత్రి సామర్లకోట పోలీసులు సమాచారం విలేకరులకు అందించారు. బండి స్వర్ణలతను బండి సురేష్ అనే వ్యక్తి వివాహం చేసుకుని వేట్లపాలెంలో నివాసం ఉండేవారు. సురేష్ ప్రతీ రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి స్వర్ణలతను మానసిక, శారీరకంగా హింసిస్తూ 2019 జూన్ 19న గొంతు మీద కాలుపెట్టి తొక్కి పురుగుల మందు పట్టించి హత్య చేశాడు. సురే్‌షకు కొండపల్లి బాలాజీ అనే వ్యక్తి సహకరించాడు. దీనిపై అప్పటి ఎస్‌ఐ వి.కిశోర్ కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఏబీజీ తిలక్ దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి 19 డిసెంబరు 2019న చార్జిషీట్‌ను కోర్టుకు అందించారు. విచారణల అనంతరం రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎం.వెంకటరత్నం ఈ కేసు విచారణను 21 మార్చి 2023న ప్రారంభించారు. కోర్టు విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరపున బలమైన వాదనలు వినిపించగా సాక్షుల విచారణ అనంతరం నిందితులపై నేరం రుజువైనందున వారిద్దరికి జీవితఖైదు శిక్ష, చెరొక రూ.3వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు నిచ్చారు. ముద్దాయిలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసు విచారణకు జిల్లా ఎస్పీ సతీ్‌షకుమార్ కృషి చేశారు. అలాగే పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి, సామర్లకోట ఎస్‌హెచ్‌వో దుర్గాప్రసాద్, ప్రాసిక్యూటర్ శంభు ప్రసాద్, హెచ్‌సీ ఎన్.సువర్ణరాజు సహకారంపై జిల్లా ఎస్పీ సతీ్‌షకుమార్ ప్రత్యేకంగా అభినందించారు.