జగన్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేపట్టాలని సీపీఐ రాష్ట్రసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఈనెల 27న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను సమర్పించాలని తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా దళితులు, మైనార్టీలు, మహిళలు, జర్నలిస్టులు, పిల్లలపై జరుగుతున్న దాడులు, హత్యలు, అఘాయిత్యాలను నిరసిస్తూ గురువారం విజయవాడలో ఈరౌండ్ టేబుల్ నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ..... జగన్ ప్రభుత్వంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని పోలీసుస్టేషన్లు వైసీపీ నాయకులకు అత్తారిళ్లుగా మారాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ సీఎం జగన్ వైసీపీ నాయకులను కాపాడుకోవడానికి తప్ప ప్రజలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించడం లేదని మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి.రమాదేవి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవానీ తదితరులు పాల్గొన్నారు.