విశాఖలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంట్ ఇచ్చారు. ఇదిలావుంటే తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనొచ్చని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పైగా, ఇవి చంద్రబాబు పలికిన మాటలేనని కేసీఆర్ అనడం ఆసక్తికరంగా మారింది. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదని, చంద్రబాబు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారో కూడా తెలియదని అమర్నాథ్ పేర్కొన్నారు. చంద్రబాబు మాటలను పక్కనబెట్టి... కేసీఆర్ వ్యాఖ్యలను చూస్తే... తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే ఆంధ్రాలో ఎన్నో ఎకరాలు కొనొచ్చంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడం తాను కూడా చూశానని వెల్లడించారు. అయితే, విశాఖలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చంటూ బదులిచ్చారు. తెలంగాణ సంగతి అటుంచితే... హైదరాబాద్ లోని భూముల ధరల కంటే ఎక్కువ ధరలు ఇవాళ విశాఖలో ఉన్నాయని అమర్నాథ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ వంటి ఒక్క నగరాన్ని పట్టుకుని, తెలంగాణ అంతా ఏదో జరిగిపోతోందనే భావనను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఏపీలో విశాఖలోనే కాదు, విజయవాడలో, నర్సీపట్నంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ భూముల ధరలు భారీగానే ఉన్నాయని వివరించారు.
భూముల ధరల సంగతి ఎవరో తన స్నేహితుడు చెప్పాడని కేసీఆర్ అనుంటే బాగుండేది... కానీ చంద్రబాబు చెప్పాడంటే ఆ మాటలను ఎవరూ నమ్మరని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. మీ రాజకీయ అవసరాల కోసం పొరుగు రాష్ట్రాలను, పొరుగు ప్రభుత్వాలను కించపరిచేలా మాట్లాడడం సమంజసం కాదని హితవు పలికారు.