రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్ కారణంగా పేలుడు సంభవించి కనీసం 31 మంది సజీవదహనమయ్యారు. ఈ దుర్ఘటన చైనాలోని యించువాన్ నగరంలో చోటుచేసుకున్నట్టు అధికారిక మీడియా వెల్లడించింది. ‘యించువాన్ నగరంలోని బార్బిక్యూ రెస్టారెంట్‌లో బుధవారం రాత్రి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లీక్ కారణంగా పేలుడు సంభవించింది’ అని చైనా అధికారిక మీడియా జున్హూ తెలిపింది. ఈ ఘటనలో కనీసం 31 మంది చనిపోయారని, మరో ఏడుగురు గాయపడ్డారని పేర్కొంది. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పింది. పేలుడు కారణంగా రెస్టారెంట్ అద్దాలు పగిలిపోయాయి.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. డజనకుపైగా అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్న ఫుటేజ్‌ను సీసీటీవీ విడుదల చేసింది. అనేక రెస్టారెంట్లు, వినోద వేదికలు ఉండే ఆ వీధి గాజు ముక్కలు, ఇతర శిధిలాలతో నిండిపోయింది. నిగ్జియా అటామస్ ప్రాంతం రాజధాని యించువాన్‌లోని ఫుయింగ్ బార్బిక్యూ రెస్టారెంట్‌లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.40 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది.
మూడు రోజుల డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సెలవుల సందర్భంగా చైనాలో చాలా మంది తమ బంధువులు, స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు సూచించారు. ‘గాయపడిన వారికి చికిత్స చేయడంలో అన్ని విధాలుగా కృషి చేయాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను సమర్థవంతంగా రక్షించడానికి కీలకమైన రంగాలలో భద్రతా పర్యవేక్షణ, నిర్వహణను బలోపేతం చేయాలని ఆదేశించారు’ అని సీసీటీవీ గురువారం నివేదించింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అగ్నిమాపక, ఎమర్జెన్సీ సర్వీసులు 100 మందికిపైగా సిబ్బంది, 20 అగ్నిమాపక యంత్రాలతో అక్కడకు చేరుకున్నట్టు చైనా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘స్థానిక అధికారులు తక్షణమే... అన్ని విధాలుగా సహాయక, రెస్క్యూ ప్రయత్నాలు చేపట్టారు.. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించి, వీలైనంత వరకు ప్రాణనష్టం తగ్గించేందుకు ప్రయత్నించారు’ పేర్కొంది. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున 5 గంటల వరకూ రెస్క్యూ కొనసాగినట్టు వెల్లడించింది.