మనదేశంలో ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మీడియా సమావేశం నిర్వహించలేదన్న విమర్శవుంది. ఇదిలావుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మీడియా ప్రశ్నలు ఎదుర్కొలేదు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ గురువారం మీడియా అడిగే ప్రశ్నలకు జవాబులు చెబుతారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీన్ని బిగ్ డీల్‌గా శ్వేత సౌధం అభివర్ణించింది. ఈ ప్రెస్‌మీట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొననున్నారు.
ప్రధాని ప్రెస్ మీట్‌కు సంబంధించిన సమాచారాన్ని వైట్ హౌస్ జాతీయ భద్రతా అధికారి జాన్ కిర్బీ వెల్లడించారు. అయితే ఈ ప్రెస్‌మీట్ ఫార్మాట్ గురించి కూడా జాన్ కిర్బీ తెలిపారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేవలం రెండు ప్రశ్నలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ రెండు ప్రశ్నల్లో ఒకటి అమెరికన్ జర్నలిస్టులు, మరో ప్రశ్నను భారతీయ మీడియా అడగనున్నట్లు వివరించారు. ఈ ప్రెస్‌మీట్‌ను బిగ్ డీల్‌గా అభివర్ణించారు. భారత ప్రధాని మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం సంతోషకరమని.. ఇది రెండు దేశాలకు అవసరమని జాన్ కిర్బీ తెలిపారు. ఇదే విషయాన్ని మోదీ కూడా వ్యక్తం చేశారని పేర్కొన్నారు. వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో మోదీ, బైడెన్ ఇద్దరూ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని శ్వేత సౌధం వర్గాలు వెల్లడించాయి. అంతకు ముందు మోదీ, బైడెన్ వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకుంటారని పేర్కొన్నారు.
అమెరికాలో మోదీ పర్యటన సందర్భంగా ఆయనను కొన్ని అంశాలపై ప్రశ్నించాలని అమెరికన్ సెనెటర్లు.. జో బైడెన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. భారత్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, మత పరమైన ఘర్షణలు, పౌర సంస్థలు.. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఇంటర్నెట్ వినియోగంపై పరిధులు విధించడం వంటి అనేక విషయాల గురించి మోదీని ప్రశ్నించాలని బైడెన్‌పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే వీటికి సంబంధించి.. ఎలాంటి ప్రశ్నలు కూడా మోదీని బైడెన్ అడగరని.. వైట్ హౌస్ వర్గాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి.
నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా జూన్ 20 న మోదీ అమెరికా వెళ్లారు. బుధవారం ఐక్య రాజ్య సమితి వేదికగా జరిగిన 9 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని నేతృత్వం వహించారు. బైడెన్ ఆహ్వానం మేరకు వెళ్లిన మోదీ.. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అమెరికా పర్యటన తర్వాత అక్కడి నుంచి మోదీ ఈజిప్ట్ వెళ్లనున్నారు.