కేదార్‌నాథ్ క్షేత్రంలో జంతువుల హింస కొనసాగుతోందని తాజాగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలావుంటే చార్‌ధామ్ యాత్రలో ఒకటైన కేదార్నాథ్లో రోజుకో సంఘటనలు బయటికి వస్తున్నాయి. మంచు కొండల్లో జంతువులు హింసకు గురవుతున్నాయి. కేదార్‌నాథ్ ఆలయం వద్దకు కింది నుంచి యాత్రికులను, వస్తువులను పర్వతాలు ఎక్కించే గుర్రాలు, గాడిదలను హింసిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వాటికి బలవంతంగా యజమానులు సిగరెట్లు తాగిస్తున్నారు. కర్రలు, రాడ్లతో ఇష్టం వచ్చినట్లు కొడుతూ వాటిని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. గుర్రాలు, గాడిదలకు గాయాలైనా పట్టించుకోకుండా వాటి పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కేదార్‌నాథ్ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఇలాంటి చర్యలపై జంతు ప్రేమికులు, జంతు సంరక్షణ సంస్థలు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నోరు లేని మూగ జీవాలను హింసిస్తున్నారని మండిపడుతున్నారు. వైరల్ అయిన వీడియోలపై పీపుల్ ఫర్ యానిమల్ సంస్థ ప్రతినిధి గౌరీ మౌలేఖీ తీవ్రంగా స్పందించారు. గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని.. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని ఆమె మండిపడ్డారు. చనిపోయిన జంతువుల మృతదేహాలను నదుల్లో విసిరేస్తున్నారని.. బలహీనమైన, పనిచేయలేని జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేదార్‌నాథ్ క్షేత్రంలో 2500 జంతువులకు అనుమతి ఉంటే.. కేవలం 1400 జంతువులతోనే పని చేయిస్తున్నారని ఆరోపించారు. గాడిదలు, గుర్రాలు అలసిపోయినా.. వాటికి మత్తు మందులు ఇచ్చి వాటితో పని చేయించి చనిపోయేలా హింసిస్తున్నారని తెలిపారు.
కేదార్‌నాథ్ ఆలయ పరిసరాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా అధికార వ్యవస్థ నిద్రపోతోందని గౌరీ మౌలేఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత మంత్రిత్వ శాఖకు ఆమె లేఖ రాశారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలపై పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థ నిరసన కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. అయినప్పటికీ.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు కేవలం బద్రీనాథ్, కేదార్నాథ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయని స్థానిక పశు వైద్యుడు డాక్టర్ సందీప్ చెప్పారు. కేదార్‌నాథ్ పుణ్య క్షేత్రంలో మొత్తం 2, 3 నెలల పని మాత్రమే ఉంటుందని.. దీంతో ఏడాదికి సరిపడా ఇప్పుడే సంపాదించాలని.. జంతువులను యజమానులు హింసిస్తున్నారని పేర్కొన్నారు. గాడిదలు, గుర్రాల శక్తికి మించి 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా పని చేయిస్తున్నారని ఆరోపించారు. వాటి సామర్థ్యం పెంచేందుకు మత్తు మందులు ఇవ్వడం వల్ల అంతర్గత అవయవాలు దెబ్బతిని అనారోగ్యం పాలవుతాయని తెలిపారు. దీంతో క్రమంగా ఆరోగ్యం క్షీణించి అవి చనిపోతాయని ఇది జంతు హింస కిందకు వస్తుందని పేర్కొన్నారు. గాడిదలు, గుర్రాలకు ధూమపానం చేయిస్తున్న వీడియో ఉత్తరాఖండ్ పశుసంవర్థక శాఖ మంత్రి సౌరభ్ బహుగుణ దృష్టికి వెళ్లడంతో నిందితులను గుర్తించి కేసు నమోదు చేశామని తెలిపారు.
కేదార్‌నాథ్ యాత్రలో భాగంగా ఉపయోగించే 399 జంతువులు మంచు పర్వతాలను ఎక్కలేకపోతున్నాయని అధికారులు గుర్తించారు. వాటిని అనర్హమైనవిగా అధికారులు ప్రకటించినా యజమానులు వాటితోనే పని చేయిస్తున్నారు. ఇలా జంతువులను హింసిస్తున్న 15 మంది యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించని 211 మందికి జరిమానా కూడా విధించారు. మరో 300 మందిని అక్కడ పనిచేయకుండా నిషేధించారు.