మన సమాజంలో అనేక వింతలు జరుగుతుంటాయి. అలాంటిదే మరో వింత చోటు చేసుకొంది. ఆన్‌లైన్ షాపింగ్ అనేది అరచేతిలో ప్రపంచం లాంటిది. మనం ఇంట్లో కదలకుండా కూర్చున్న చోటే ఉండి.. ఏది కావాలంటే అది ఇంటికి తీసుకురావచ్చు. ఇటీవల ఆన్‌లైన్ షాపింగ్‌కు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. పొద్దున లేచినపుడు తోముకునే పళ్ల బ్రష్ నుంచి రాత్రి పడుకునే దిండు వరకు.. సర్వం మనకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. ఇక కస్టమర్లను ఆకర్షించేందుకు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు విపరీతమైన రాయితీలు, డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. బై నౌ.. పే లేటర్ అంటూ.. ఇప్పుడు కొనుక్కోండి.. తర్వాత చెల్లించండి అని ఊరిస్తున్నాయి. మార్కెట్‌లో చాలా ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు అందుబాటులోకి రావడంతో ఒకరితో ఒకరు పోటీ పడి.. వేగంగా వస్తువులను డెలివరీ చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన వస్తువు మాత్రం ఇంటికి రావడానికి 4 ఏళ్లు పట్టింది.
ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నితిన్ అగర్వాల్ కొవిడ్ కంటే ముందు ఓ వస్తువును ఆర్డర్ చేశాడు. అది నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చివరికి ఆయన వద్దకు చేరింది. దీనికి సంబంధించిన వివరాలను నితిన్ అగర్వాల్ ట్విటర్‌లో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. చైనాకు చెందిన ఈ - కామర్స్ వేదిక ఆలీ ఎక్స్‌ప్రెస్ నుంచి కరోనా మహమ్మారి విజృంభించక ముందు ఓ వస్తువును ఆర్డర్ చేశాడు. అయితే ఆ వస్తువు నాలుగేళ్ల తర్వాత తన వద్దకు వచ్చిందని చెబుతూ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించాడు. చివరికి ఆ ఆర్డర్ తన వద్దకు చేరడం ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ చేశాడు. ఆ ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించారు. ఎవరూ ఆశలు కోల్పోవద్దు.. ఎప్పుడో ఒకప్పుడు మీ వస్తువులు మీ వద్దకు చేరతాయి అంటూ ట్వీట్ చేశాడు.
అయితే ఈ ఆర్డర్ ఆలస్యానికి గల కారణాలను నితిన్ అగర్వాల్ వెల్లడించారు. జాతీయ భద్రతను కారణంగా చూపుతూ 2020 లో భారత ప్రభుత్వం ఆలీ ఎక్స్‌ప్రెస్‌పై నిషేధం విధించింది. ఆలీ ఎక్స్‌ప్రెస్‌ను నిషేధించక ముందే తాను ఆ వెబ్‌సైట్‌లో వస్తువును ఆర్డర్ చేసినట్లు నితిన్ అగర్వాల్ తెలిపారు. అయితే తాను ఏ వస్తువును కొనుగోలు చేశానన్న వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ఆర్డర్ లేట్ కావడంతో నితిన్ అగర్వాల్ చేసిన ట్విటర్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు, మీమర్లు జోక్‌లు, కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ తాను 2019 డిసెంబర్‌లో రెండు వస్తువులను ఆర్డర్ చేశానని ఇక అవి రావు అని వదిలిపెట్టానని చెప్పాడు. ఇప్పుడు ఈ పోస్ట్ చూశాక ఎప్పటికైనా తన వస్తువు తన వద్దకు తిరిగి వస్తుందని నమ్మకం వచ్చిందని పేర్కొన్నాడు. నితిన్ అగర్వాల్ చాలా అదృష్టవంతులు అని మరో యూజర్ ట్వీట్ చేశాడు. తాను 2017-19 మధ్యకాలంలో నేను చాలా ఆర్డర్లు చేశానని.. వాటి బిల్లులన్నీ తన వద్ద ఉన్నాయని.. వాటి కోసం ఎదురు చూస్తున్నానని అంటూ తెలిపాడు.